మైలార్‌దేవ్‌పల్లి, ఫిబ్రవరి 19: పనిచేస్తున్న చోట ప్రమాదవశాత్తు మెషీన్లో చీర ఇరుక్కుపోయి. ఓ మహిళ మృతి చెందిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సత్యకుమార్ తెలిపిన వివరాల ప్రకారం కాటేదాన్‌కు చెందిన మహేష్, అనిత్(30) భార్యభర్తలు. అనిత్ కాటేదాన్‌లోని కమల పుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో స్వీపర్‌గా పని చేస్తున్నారు.
బుధవారం కంపెనీలో ప్రాంగణంలో ఊడుస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆమె చీర మెషీన్లో ఇరుక్కుపోయింది. దీంతో చీర ఆమె మెడకు బిగుసుకొని ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకుంది. విషయాన్ని గమనించిన సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలపడంతో వారు సంఘటన స్థలానికి చేరుకోని మృతదేహాన్ని పోస్టమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.