Accident | సైదాబాద్, జూన్ 4 : చంచల్‌గూడ చౌరస్తాలో రహదారిపై ఓ కారు వాహనాదారులను ఢీకొట్టడంతో ఓ మహిళ మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్ర గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం ఆర్ధరాత్రి చంచల్‌గూడ ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైదాబాద్ జయనగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ సలీమ్ (టీఎస్ 09 ఏఫ్ఆర్ 0171) కారులో నల్గొండ చౌరస్తా నుంచి సైదాబాద్ జయనగర్‌లోని తన ఇంటికి వస్తున్నాడు. వెనుక నుంచి అతి వేగంగా వచ్చి నాలుగు ద్విచక్రవాహనాలను బలంగా ఢీకొట్టి డివైడర్‌పైకి దూసుకెళ్లి అగిపోయింది.
కారు ఢీకొట్టడంతో ద్విచక్రవాహనంపై కుటుంబ సభ్యులతో కలిసి వస్తున్న ఆస్మాన్‌ఘడ్ గాంధీనగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ తన భార్య సీమా(26) వారి కుమార్తెలు మదిహా ఫాతిమా (4), అయార ఫాతిమా (రెండున్నర సంవత్సరాలు) కు గాయలయ్యాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ ద్విచక్రవాహనదారుడు మహ్మద్ అబ్దుల్ భార్య సీమా (26) మృతి చెందగా, భర్త మహ్మద్ అబ్దుల్, వారి కుమార్తెలు మదిహా ఫాతిమా (4) రెండున్నర ఏండ్ల అయార ఫాతిమా తీవ్ర గాయలతో చికిత్స పొందుతున్నారు.
రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకొన్న మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల ఉస్మానియా దవాఖానకు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి, గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ప్రమాద స్థలం నుంచి కారును తొలగించి ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు స్వాధీన పర్చుకొని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని సైదాబాద్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ దర్యాప్తు జరుపుతున్నారు.