బంజారాహిల్స్: అపరిశుభ్రమైన వాతావరణంలో కల్తీ పదార్థాలతో తయారు చేసిన మోమోస్ తిని ఓ మహిళ మృతిచెందగా, సుమారు 100 మందికి పైగా ఆస్పత్రిపాలయ్యారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. బంజారాహిల్స్ రోడ్ నం. 10లోని సింగాడకుంటలో నివాసం ఉంటున్న రేష్మా బేగం(31) తన ఇద్దరు పిల్లలు రెమిషా(12), రఫియా(11)తో కలిసి శుక్రవారం సాయంత్రం స్థానికంగా వారాంతపు సంతకు వెళ్లింది. అక్కడ రోడ్డు పక్కన ఢిల్లీ హాట్ మోమోస్ పేరుతో స్టాల్లో అందరూ మోమోస్ తిన్నారు. ఇంటికి వెళ్లాక అరగంటలోనే పిల్లలిద్దరితో పాటు రేష్మాబేగం తీవ్రమైన కడుపు నొప్పితో పాటు వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
శనివారం తీవ్ర ఇబ్బందులు పడిన పిల్లలు ఇద్దరూ రాత్రికి కోలుకున్నారు. అయితే రేష్మా బేగం అపస్మారక స్థితిలోకి చేరుకున్నది. దీంతో ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు నిమ్స్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా, సింగాడకుంటతో పాటు నందినగర్, గౌరీశంకర్‌కాలనీ తదితర ప్రాంతాల్లో కూడా చాలామంది ఇదే విధంగా వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నట్లు ఆదివారం రాత్రి బయటపడింది. వీరందరూ అనారోగ్యానికి గురికావడానికి కారణమైన ఢిల్లీ హాట్ మోమోస్ సంస్థ తరపున విక్రయించిన ఎండీ.
రజాక్(19), చింతల్‌బస్తీలోని సంస్థ యజమాని ఎండీ. అర్మాన్(35)పై చర్యలు తీసుకోవాలని బాధితులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నందినగర్‌లో మోమోస్ విక్రయించిన రజాక్, సింగాడకుంటలో అమ్మిన సాజీద్ హుస్సేన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా ఖైరతాబాద్‌లోని చింతల్‌బస్తీలో మోమోస్ తయారు చేస్తున్న వావ్ హాట్ మోమోస్, ఢిల్లీ హాట్ మోమోస్ సంస్థల్లో బల్దియా అధికారులు దాడులు నిర్వహించారు. ఎలాంటి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేకుండానే ఇక్కడ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
అపరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేసిన మోమోస్, వాటిలో వినియోగిస్తున్న పదార్థాల నమూనాలను సేకరించి, స్టేట్ ఫుడ్ ల్యాబ్‌కు పంపించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తయారీ కేంద్రాన్ని మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంలో లోతుగా దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ పోలీసులకు లేఖ రాశారు. కాగా, నందినగర్‌లో మోమోస్ తినడంతో తీవ్ర ఆస్వస్థతకు గురై పలు అస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి, వెంకటేశ్వరకాలనీ కార్పొరేటర్ కవితారెడ్డి పరామర్శించారు.