Cable Bridge | మాదాపూర్, జూన్ 17: గుర్తు తెలియని ఓ యువతి నిద్రమాత్రలు వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు ఆ యువతిని కాపాడి.. సమీపంలోని దవాఖానకు తరలించి వైద్యం అందించారు. ఈ ఘటన సోమవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ మల్లేశ్ కథనం ప్రకారం.. గుర్తు తెలియని ఓ యువతి (25) మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్దకు వచ్చింది.
నడక దారిలో ఆత్మహత్య చేసుకునేందుకు నిద్ర మాత్రలు వేసుకొని.. బ్రిడ్జి పైనుంచి దూకేందుకు వెళ్తూ.. ఒక్కసారిగా రోడ్డుపై కుప్పకూలిపోయింది. అక్కడే ఉన్న పెట్రోలింగ్ ట్రాఫిక్ పోలీసులు గమనించి.. ఆ యువతిని సమీపంలో ఉన్న దవాఖానకు తరలించి చికిత్స అందించారు. ఆ యువతి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదని దవాఖాన వైద్యులు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.