సిటీబ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ)/ కేపీహెచ్‌బీకాలనీ: ఇంట్లో ఖాళీగా ఉన్నామని ఒకరు.. పనిచేసే ఉద్యోగంతో వచ్చే సంపాదన కుటుంబ పోషణకు సరిపోక మరొకరు… ఏదో ఒకటి అదనంగా పనిచేసి మరి కొంత డబ్బు సంపాదించాలని ఇంకొకరు.. ఇలా పార్ట్‌టైమ్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వారిని టార్గెట్‌గా చేసుకొని సైబర్‌నేరగాళ్లు పేరున్న కంపెనీల్లో పార్ట్‌టైమ్ ఉద్యోగాలంటూ సోషల్‌మీడియా ద్వారా ప్రకటనలు ఇవ్వడం, సెల్ఫోన్లకు మెసేజ్‌లు పంపిస్తూ వారిని బుట్టలో వేస్తూ నిండా ముంచేస్తున్నారు.
నేడు సైబర్నేరగాళ్లను కట్టడి చేయడంలో తెలంగాణ పోలీసులు చేతులెత్తేశారా? అని ప్రజలు చర్చించుకుంటున్నారు. మూడేండ్ల కింద అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఇలాంటి ఘటనలు జరిగితే పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటూ సైబర్‌నేరగాళ్లపై ఉక్కుపాదం మోపిన ఘటనలున్నాయి. లోన్‌యాప్‌ల నిర్వాహకుల వేధింపులకు తట్టకోలేక బాధితులు బలవన్మరణం పాల్పడటంతో లోన్‌యాప్‌ల నిర్వాహకులు, కాల్ సెంటర్లు, కార్యాలయాలపై దేశ వ్యాప్తంగా దాడులు చేసి నేరాలను కట్టడి చేశారు. ఒక పక్క నేరస్తుల కట్టడి.. మరో పక్క ప్రజల్లో పేరు.. ఊరు లేని లోన్ యాప్‌ల నుంచి రుణాలు తీసుకోవద్దని అవగాహన కల్పించారు. అంతకు ముందు కలర్ ప్రిడిక్షన్ గేమ్‌తో అమాయకులకు వల వేసి కోట్లను కొల్లగొట్టిన సైబర్‌నేరగాళ్ల ఆటను సైతం తెలంగాణ పోలీసులు కట్టడి చేశారు.
నేడు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, డిజిటల్ అరెస్ట్‌ల పేరుతో ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల రూపాయలు సైబర్‌నేరగాళ్లు కొట్టేస్తున్నారు. సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతుండటంతో అందుకు తగ్గట్టుగా వాటిని కట్టడి చేసేందుకు ప్రత్యేక వ్యవస్థలను సైతం ఏర్పాటు చేశారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరోతోపాటు ఆయా కమిషనరేట్ల పరిధిలోని సైబర్‌నేరాల దర్యాప్తునకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయినా సైబర్నేరాలను కట్టడి చేయడంలో పోలీసులు విఫలమవుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, స్టాక్‌మార్కెట్ పెట్టుబడులు, డిజిటల్ అరెస్ట్‌లకు సంబంధించిన మోసాల్లో ఉద్యోగాలంటూ ఆశ పెడుతూ నేరగాళ్లు మోసం చేస్తుండగా, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు అనగానే ఆశకు పోయి బాధితులు భారీగా డబ్బు పోగొట్టుకుంటున్నారు. డిజిటల్ అరెస్ట్‌లలో పోలీసుల పేరు చెప్పి బెదిరిస్తుండటంతో చాలా మంది భయాందోళనకు గురవుతూ నేరగాళ్ల ట్రాప్‌లో చిక్కుకుంటున్నారు. ఇలాంటి మోసాల సూత్రధారులు ఇతర దేశాల్లో ఉంటుండగా, వారికి సహకరించే వారు దేశంలోని వివిధ రాష్ర్టాల్లో ఉంటున్నారు.
ఇతర దేశాల్లో ఉండే సూత్రధారులను పట్టుకురావడం కష్టమైన పని కావడంతో పోలీసులు సైతం తామేమీ చేస్తామని చేతులెత్తేసే పరిస్థితికి వచ్చారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సైబర్‌నేరాలకు బ్యాంకింగ్‌తో దగ్గరి సంబంధాలున్నాయి.నేరగాళ్ల సూచన మేరకు బాధితుడు డబ్బంతా వివిధ బ్యాంకు ఖాతాల్లోనే డిపాజిట్ చేస్తున్నారు. దీంతో బ్యాంకింగ్ విభాగాన్ని కట్టుదిట్టం చేస్తే చాలా వరకు సైబర్‌నేరాలు కట్టడి చేసే అవకాశముంటుంది. బ్యాంకు ఖాతాలు నేరగాళ్ల చేతికి చిక్కకుండా కట్టుదిట్టమైన ప్రణాళికలను అమలు చేయాల్సి ఉన్నా ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలున్నాయి.
గతంలో తరచూ సైబర్‌క్రైమ్ బృందాలు ఇతర రాష్ర్టాల్లో నేరగాళ్ల కోసం గాలింపు చేస్తూ కీలక నిందితులను పట్టుకునేవారు. నేడు ఎప్పుడో ఓ సారి బృందాలు ఇతర రాష్ర్టాలకు వెళ్తున్నాయి. బాధితులు ఇక్కడుంటుండగా, నేరస్తులు ఇతర రాష్ర్టాలు, ఇతర దేశాల్లో ఉంటున్నారు. నేరం చేసినవాడు ఇక్కడి నుంచి మేము వెళ్లే సరికే ఫోన్ నంబర్‌తోపాటు నివాసాన్ని మార్చేస్తాడు. చివరకు బ్యాంకు ఖాతాదారులను పట్టుకొని తాము ఆయా కేసుల్లో నిందితులను అరెస్ట్ చేశామని చెప్పుకొంటున్నారు.
ఆయా రాష్ర్టాలతో సమన్వయం చేసుకుంటూ నేరగాళ్లను పట్టుకుంటున్నామని చెబుతున్నా, అది కూడా అంతంత మాత్రమే కొనసాగుతుండటం గమనార్హం. కాగా, వివిధ రాష్ర్టాల్లో అమాయకుల నుంచి బ్యాంకు ఖాతాలను కమీషన్ పద్ధతిలో కొన్నిసార్లు, మరికొన్ని సార్లు ఒకేసారి కొంత డబ్బు ఇచ్చి సైబర్ నేరగాళ్ల ముఠాలు బ్యాంకు ఖాతాలను తీసుకొని వాడుకోవడం చేస్తున్నారు. తమ బ్యాంకు ఖాతాలను నేరాలకు వాడుతున్నారని కొందరికి తెలిసినా, మరికొందరికి తెలియదు. ఈ బ్యాంకు ఖాతాదారులే చివరకు పోలీసులకు చిక్కుతున్నారు. బ్యాంకు ఖాతాదారులను పట్టుకొని మేం ఫలానా కేసులో నిందితులను అరెస్ట్ చేశామంటూ పోలీసులు చెప్పుకొంటున్నారు. నేరాలను కట్టడి చేసేందుకు తూతూ మంత్రపు చర్యలు కాకుండా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఈ నేరాలను అదుపు చేసేందుకు తగిన ప్రణాళికలతో ముం దుకు వెళ్లాల్సిన అవసరముందని ప్రజలు కోరుతున్నారు.
సిటీబ్యూరో: ట్రేడ్ మార్కెటింగ్, సైబర్ నేరాలకు పాల్పడుతున్న 25 మందిని అరెస్ట్ చేశామని సైబర్‌క్రైం డిప్యూటీ కమిషనర్ ప్రకటించారు. జూన్ నెలలో చేపట్టిన అంతర్రాష్ట్ర ఆపరేషన్‌లో భాగంగా ఏడు రాష్ర్టాల నుంచి వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి నుంచి రికవరీ చేసిన రూ.72.85 లక్షల నగదును బాధితులకు అందజేసినట్లు వివరించారు.
నిందితులకు ఏడు రాష్ర్టాల్లో కలిపి 453 కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు గుర్తించామన్నారు. అందులో తమిళనాడు-34, పంజాబ్-4, ఉత్తరప్రదేశ్-36, పశ్చిమ బెంగాల్-16, జమ్ముకశ్మీర్-6, తెలంగాణ రాష్ట్రంలో 66 కేసులు నమోదైనట్లు వివరించారు. నిందితుల నుంచి 34 సెల్ఫోన్లు, చెక్‌బుక్‌లు 20, డెబిట్‌కార్డులు 17, సిమ్ కార్డులు 8, బ్యాంక్ పాసు బుక్కులు 16, నగదు రూ.లక్ష రికవరీ చేసినట్లు చెప్పారు. అదేవిధంగా జూన్ 14న హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ విభాగం నిర్వహించిన లోక్ అదాలత్ సందర్భంగా 64 కేసుల్లో బాధితులకు రూ.3.68 కోట్ల నగదు తిరిగి ఇచ్చినట్లు వెల్లడించారు.