సుల్తాన్‌బజార్, నవంబర్ 7: సుల్తాన్‌బజార్‌లోని ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో నవజాత శిశువును అపహరించేందుకు యత్నించిన ఓ మహిళను గురువారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. సుల్తాన్‌బజార్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసాచారి, ఎస్ఐ అంకం నరేశ్ వివరాలను వెల్లడించారు. రెయిన్ బజార్ ప్రాంతానికి చెందిన అస్కారి బేగం(45)ఇండ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నది. ఆమె కూతురు ఫాతిమా బేగం ప్రసవం కోసం కోఠీలోని సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో చేరింది. కూతురి వద్ద సహాయకురాలిగా ఉండేందుకు అస్కారి బేగం వచ్చింది. ఇదిలా ఉండగా.. అస్కారి బేగంను ఓ గుర్తు తెలియని వ్యక్తి కలిశాడు.
మగ బిడ్డను ఇస్తే రూ.50వేలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. దీంతో ఈ నెల 5వ తేదీ రాత్రి 11.30 గంటల సమయంలో నూతన భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లోని లేబర్ రూమ్ వద్ద రహమతున్నీసా బేగంకు జన్మించిన శిశువును అపహరించేందుకు ప్రయత్నించారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది, టీజీ ఎస్పీఎఫ్ పోలీసులు సమన్వయంతో శిశువు కిడ్నాప్ కాకుండా కాపాడారు. ఆ రోజు రాత్రి కిడ్నాప్‌నకు విఫలయత్నం చేసిన మహిళ నుంచి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని వదిలి పెట్టారు.
బుధవారం ఉదయం అస్కారి బేగం తిరిగి శిశువును అపహరించేందుకు దవాఖానకు రాగా.. సెక్యూరిటీ గార్డు గుర్తించి, సూపరింటెండెంట్‌కు, టీజీఎస్పీఎఫ్ పోలీసులకు సమాచారమిచ్చాడు. నిందితురాలిని పట్టుకొని సుల్తాన్‌బజార్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు పాత నేరస్థురాలిగా గుర్తించి కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆమెపై చార్మినార్ పీఎస్‌లో 4 కేసులు, మీర్‌చౌక్ పీఎస్‌లో ఒకటి, అబిడ్స్, తుకారాంగేట్, సుల్తాన్‌బజార్ పీఎస్‌లలో ఒక్కొక్క కేసు ఉన్నదని పోలీసులు తెలిపారు.
దవాఖానలో శిశువు అపహరణ విఫలయత్నం ఘటన సమయంలో విధుల్లో ఉన్న ఒక హెడ్ నర్సు, ఇద్దరు స్టాఫ్ నర్సులకు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ జాలెం అనురాధ మెమోలను జారీ చేశారు. విధి నిర్వహణలో ఉన్న సమయంలో అప్రమత్తంగా ఉండాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని ఆమె సూచించారు. తమ వార్డులోని నవజాత శిశువును అపహరించేందుకు ఓ మహిళ యత్నించగా.. విధుల్లో ఉండి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో పాటు అప్రమత్తం చేయలేని కారణంగా ఆ ముగ్గురికి మెమోలను జారీ చేసినట్టు తెలిపారు.