అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు
బస్తీబాటలో భాగంగా నేతాజీనగర్‌లో పర్యటించిన బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల
సికింద్రాబాద్, ఫిబ్రవరి 25: రాష్ట్ర సర్కారు నిధులతోనే కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ప్రాంతాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం బస్తీబాటలో భాగంగా ఒకటో వార్డులోని న్యూ బోయిన్పల్లి నేతాజీనగర్ బస్తీలో స్థానికులతో కలిసి జక్కుల పర్యటించారు. ఇంటింటికీ పర్యటిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గతంలో బస్తీలో చేపట్టిన పనులతో పాటు పెండింగ్‌లో ఉన్న పనులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జక్కుల పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్కారు జారీ చేసిన జీఓ నంబర్ 58 ప్రకారం నేతాజీనగర్ బస్తీలోని ప్రతి ఒక్కరికీ పట్టాలు వచ్చే విధంగా చూస్తానని స్పష్టం చేశారు. బోర్డుకు కేంద్ర సర్కారు నిధులను ఇవ్వకుండా చోద్యం చూస్తుందని, దీంతో ఆయా వార్డుల్లో అభివృద్ధి పనులకు ఆటంకాలు ఎదురవుతున్నాయన్నారు. ఇటీవల కాలంలోనే జీహెచ్ఎంసీ మాదిరిగానే కంటోన్మెంట్‌కు ఉచిత తాగునీటి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని, సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేసేలా కృషి చేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో వార్డును మరింత అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ఆహర్నిశలు శ్రమిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అమృద్దీన్, నర్సింగ్‌రావు, శ్రీనివాస్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.