హైదరాబాద్ : హైదరాబాద్ మహా నగరంలో వాతావరణం వేగంగా మారుతుంది. అందులో భాగంగానే చలికాలం రానే వచ్చింది. చలి గాలులతో పాటే ప్రతి ఇంటా జలుబు, దగ్గు, రొంప, గొంతు నొప్పులు ఇంకా ఎన్నో రోగాలు వస్తున్నాయి. చలి కాలం అంటే.. అనేక రోగాలతో పొంచి ఉన్న కాలమని, ఆ కాలానికి అనుగుణంగా జాగ్రత్తలు పాటించాలని వైద్య నిఫుణులు చెబుతున్నారు. వాతావరణ పరిస్థితులు మనిషి ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయంటున్నారు. వాతావరణంలో కలిగే మార్పుల ఆధారంగా మనిషి శరీరంలో పలు రకాల మార్పులు చేర్పులు జరుగుతాయి. దీని వల్ల ఉష్ణోగ్రతలు తీవ్రమైనా లేదా సాధారణం కంటే అధికమైనా అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా చలి కాలాన్ని వైరస్ల కాలంగా పరిగణిస్తారు. చల్లదనం వైరస్ల వృద్ధి, వ్యాప్తికి అనుకూలంగా ఉంటుందని ఉస్మానియా, గాంధీ వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ మన మధ్య నుంచి ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. దీనికి చలి కాలంలో వ్యాపించే వైరస్లు తోడైతే అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు నిర్లక్ష్యం వహించకుండా కరోనా నియమాలు పాటించాలని వారు సూచిస్తున్నారు.
చల్లదనంతో పిల్లల్లో వెంటనే జలుబు ఎటాక్ అవుతుంది. ఇది ఎలర్జిక్గా మారి దగ్గు, ఆయసానికి దారితీస్తుంది. నిర్లక్ష్యం చేస్తే జబ్బు ముదిరి న్యూమోనియాగా మారే ప్రమాదం ఉంటుంది. చల్లదనం వల్ల పిల్లల్లో ఎక్కువగా ‘బ్రాంకొలటిస్’ (పాల ఉబ్బసం) వచ్చే అవకాశాలు అధికం. ఈ వ్యాధి ఉన్న పిల్లలను చలికాలంలో తల్లిదండ్రులు చాలా జాగ్రతగా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు పిల్లలను వెచ్చని వాతావరణంలో ఉండే విధంగా చూడాలి. నవజాత శిశువుల విషయంలో కూడా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ఈ బేబీస్ చాలా త్వరగా వెదర్‌కు రియాక్టవుతారు. న్యూబర్న్ బేబీస్‌ను గది ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉండే లా చూడాలి. శిశువులు ఉన్న గదిని సాధ్యమైనంత వరకు మూసి ఉంచే ప్రయత్నం చేయాలి. అవసరమైతే రూమ్ హీటర్స్‌ను వినియోగించాలి. స్థోమత లేనివారు 100 వాట్స్ పాత కాలం బల్బులను వినియోగించినా సరిపోతుంది. గది ఉష్ణోగ్రత పెరుగుతుంది. – డాక్టర్ రమేష్ దంపురి, ఆర్ఎంఓ, నిలోఫర్ దవాఖ