బేగంపేట/అమీర్‌పేట్, జనవరి 15: సనత్‌నగర్ డీఎన్ఎం కాలనీలో పేరుకుపోయిన సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ దృష్టికి బుధవారం తీసుకువచ్చారు. కాలనీలో పారిశుధ్య సమస్యలతో పాటు అర్ధరాత్రుల్లో ఆకతాయిల ఆగడాల వల్ల తలెత్తుతున్న ఇబ్బందులను కాలనీ వాసుల ప్రస్తావించారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను సానుకూలంగా విన్న ఎమ్మెల్యే తలసాని సనత్‌నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులుతో ఫోన్లో మాట్లాడుతూ డీఎన్ఎం కాలనీలో ఆకతాయిల ఆగడాలను సీరియస్‌గా తీసుకోవాలని, అర్ధరాత్రుల్లో పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే తలసానిని కలిసిన వారిలో జామా మసీదు జాఫ్రి (సనత్‌నగర్) మసీదు అధ్యక్షులు సయ్యద్ నొమానుద్దీన్, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు షంషీర్ బేగ్, మహ్మద్ ఇలియాస్, రషీద్‌ఖాన్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.