Cable Bridge | సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : “మీరాలం చెరువు మీద సుందరమైన కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చేస్తాం. దీనితో పర్యాటకంగా అ ప్రాంతం అభివృద్ధి చెందడంతోపాటు, ఓల్డ్ సిటీ రవాణా సదుపాయాలు మెరుగుపడతాయి. బెంగుళూరు హైవేకు మరింత వేగంగా చేరుకునే వెసులుబాటు దొరుకుతుంది.” అంటూ సీఎం రేవంత్ రెడ్డి పలు వేదికలపై ప్రసంగించారు. కానీ ఈ ప్రాజెక్టును ఎవరు చేపడుతున్నారనేది ఇప్పటికీ గందరగోళంగానే మారింది. గతంలో ఈ ప్రాజెక్టుపై అధ్యయనం చేసేందుకు హెచ్ఎండీఏ ట్రాన్సాక్షషనల్ అడ్వైజరీల నియామకానికి చర్యలు చేపట్టింది.
ఆ తర్వాత పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి చేసిన సమీక్షల్లో హెచ్ఎండీఏ అధికారులు లేకుండానే సమావేశాలు జరగాయి. అదే సమయంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఆథారిటీతోపాటు, జీహెచ్ఎంసీ అధికారలతో కలిసి ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం చర్చించింది. అసలు ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను ఏ విభాగం పర్యవేక్షిస్తుందని ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్నగా మారింది. మీరాలం చెరువును పర్యాటక ప్రాంతంగా, బెంగుళూరు హైవేకు రవాణా సదుపాయాలను మెరుగుపరిచేలా ఆధునీకరించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మీరాలం బ్యూటీఫికేషన్ అప్పట్లోనూ కార్యాచరణ రూపొందించారు. అయితే అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆ చెరువుపై నిర్మించే కేబుల్ బ్రిడ్జి నిర్మాణాన్ని గందరగోళంలో పడేశారు.
టీఏ టెండర్లను పిలిచింది హెచ్ఎండీఏ..
మీరాలం చెరువు అభివృద్ధికి చేపట్టాల్సిన నమూనాలను తీర్చిదిద్దేందుకు కన్సల్టెన్సీని ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏనే తొలుత టెండ్లను ఆహ్వానించింది. ఏరియా డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసి, పబ్లిక్-ప్రైవేట్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన సమగ్రమైన విధివిధానాలను రూపొందించే పనులు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించింది. కానీ ఆ తర్వాత జరిగిన సమీక్ష సమావేశాలను హెచ్ఎండీఏ ప్రమేయం లేకుండా నిర్వహించడంతో అసలు గందరగోళం మొదలైంది. నెల రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి కనీసం హెచ్ఎండీఏ కమిషనర్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు లేకుండా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే అదే మీటింగ్లో ఎంఆర్డీసీఎల్, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొనడంతో డీపీఆర్ రూపకల్పన ఏ విభాగం పర్యవేక్షిస్తుందనే తేలాల్సి ఉంది.