కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 22: తనకు ఇష్టం లేకుండా.. తన కూతురు పెండ్లి చేసేందుకు యత్నిస్తున్న భర్తను భార్య మరో ఇద్దరితో కలిసి కరెంట్ షాక్ పెట్టి హత్య చేసిన కేసును ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో కేపీహెచ్బీ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు భార్యతోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. మంగళవారం కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్లో కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు, కేపీహెచ్బీ కాలనీ సీఐ రాజశేఖర్ రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు.
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పాత లింగయ్యపల్లి గ్రామానికి చెందిన బోయిని సాయిలు (45), కవిత దంపతులకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. వీరికి పెండ్లయిన కొన్నేండ్లకే భార్యభర్తల మధ్య విభేదాలు రావడంతో గత 14 ఏండ్లుగా వేర్వేరు జీవిస్తున్నారు. కాగా, సాయిలు సొంత ఊర్లోనే పిల్లలతో కలిసి జీవిస్తుండగా, కవిత మాత్రం హైదరాబాద్ లో నివాసముంటున్నది. ఇటీవల సాయిలు తన కూతురి వివాహాన్ని అక్క కొడుకు (మేనల్లుడు)తో చేయాలని నిర్ణయించుకోగా.. దీనికి భార్య కవిత వద్దని వారించింది. దీంతో తన కూతురు పెండ్లి ఇష్టం లేకుండా చేస్తున్నాడని, భర్తను ఎలాగైనా చంపాలని పథకం వేసింది.
అందులో భాగంగానే ఈనెల 12వ తేదీన ఊరికి వెళ్లి అతను పనిచేస్తున్న చోట రూ.20వేలు అప్పు చెల్లించింది. కూతురు పెండ్లికి ఎక్కువ డబ్బులు సంపాదిద్దామని భర్తకు నచ్చజెప్పి హైదరాబాద్కు తీసుకొచ్చింది. అనంతరం సాయిలును కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ని మిత్రాహిల్స్ లో గుడిసెలో నివసిస్తున్న చెల్లెలు జ్యోతి, మరిది మల్లేష్ ఇంటికి తీసుకువచ్చింది. పథకం ప్రకారం… ఈనెల 19వ తేదీన రాత్రి సాయిలుకు బాగా కల్లు తాగించి మత్తులోకి వెళ్లగానే భార్య కవిత, చెల్లెలు జ్యోతి, మల్లేష్తో కలిసి కరెంట్ షాక్ పెట్టారు.
కొన ఊపిరితో ఉన్నాడని భావించి గొంతు, మర్మాంగాలు పిసికి హత్య చేశారు. అనంతరం శవాన్ని మాయం చేసేందుకు ఒక కవర్లో మూటగట్టి ఓ ఆటోను కిరాయికి తీసుకొని సంగారెడ్డి సమీపంలోని చెరువులో వేసేందుకు యత్నించారు. దీంతో ఆటో డ్రైవర్ కు అనుమానం వచ్చి ఇది ఏమిటని ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానం చెప్పారు. మీరు చేస్తున్న పనికి నేను సహకరించనని ఆటో డ్రైవర్ వల్లి నాయక్ అడ్డం తిరిగాడు. దీంతో తిరిగి ఇంటికి చేరుకున్నారు. అదే రోజు రాత్రి సమీపంలోని ఓ నిర్మాణ ప్రదేశంలో గుంతలో శవాన్ని పూడ్చివేసి ఎవరి దారిన వారు ఇండ్లకు వెళ్లిపోయారు.
ఊరెళ్లి నాటకమాడిన భార్య..
భర్తను చంపిన కవిత… ఊరికి వెళ్లి తన భర్త పని కోసం వెళ్లి తిరిగి రాలేదని నాటకం ఆడటం మొదలుపెట్టింది. దీంతో అత్త, కొడుకు, కూతురు ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానం చెప్పడంతో వారికి అనుమానం మొదలైంది. మరోవైపు ఆటో డ్రైవర్ ఉదయాన్నే కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్కు చేరుకొని.. జరిగిన విషయాన్ని వివరించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జ్యోతి, మల్లేశ్ ఇంటికెళ్లి అదుపులోకి తీసుకొని విచారించారు. అలాగే ఊరికి వెళ్లిన కవితను తీసుకొచ్చి విచారించగా… వారు ముగ్గురు కలిసి పథకం ప్రకారం సాయిలును హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో ముగ్గురిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. 24 గంటల్లో కేసును ఛేదించిన సిబ్బందిని పోలీస్ అధికారులు అభినందించారు.