మియాపూర్, ఏప్రిల్ 22: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకున్నది. మద్యం మత్తులో భార్యతో పాటు అత్తపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. మియాపూర్ జనప్రియ నగర్లో నివాసం ఉండే మహేశ్ రెండేళ్ల కిందట శ్రీదేవిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఏడాది పైబడిన కూతురు ఉన్నది. క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్న మహేశ్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు చోటుచేసుకుంటున్నాయి. మహేశ్ పెట్టే హింస భరించలేక శ్రీదేవి తన పుట్టింటికి వెళ్లింది.
తన తమ్ముడి ఇంట్లో పుట్టినరోజు వేడుకలకు వెళ్లాల్సి ఉందని మహేశ్ భార్య శ్రీదేవిని పుట్టింటి నుంచి జనప్రియనగర్‌లోని తన ఇంటికి సోమవారం పిలిపించుకున్నాడు.ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో ఆవేశంతో మద్యం మత్తులో ఉన్న మహేశ్ కూరగాయలు కోసే కత్తితో భార్య శ్రీదేవిపై, అడ్డొచ్చిన అత్తపై దాడి చేశాడు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించారు. తీవ్రగాయాలతో శ్రీదేవి తల్లి ఐసీయూలో చికిత్స పొందుతుండగా, శ్రీదేవి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శ్రీదేవి వాంగ్మూలం నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు మహేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.