సిటీబ్యూరో : గ్రేటర్ ప్రధాన ట్రాఫిక్ కారిడార్లలో రద్దీ తగ్గించడం, రహదారి భద్రతను మెరుగుపరిచేందుకు రోడ్డు విస్తరణ, ఫ్లై ఓవర్ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ దృష్టి సారించిందని కమిషనర్ ఆమ్రపాలి పేర్కొన్నారు. చార్మినార్ జోన్లో పట్టణ మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టు పనుల పురోగతిపై బుధవారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చార్మినార్ జోన్లో పలు ప్రాంతాల్లో ప్రతిపాదిత రోడ్డు విస్తరణ, అభివృద్ధి, ఫ్లై ఓవర్ నిర్మాణాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
బెంగళూరు నేషనల్ హైవే నుంచి శాస్త్రీపురం జంక్షన్ వరకు 100 అడుగుల రహదారి విస్తరణ అభివృద్ధి, శాస్త్రీపురం జంక్షన్ నుంచి ఇంజన్ బౌలి వరకు 100 అడుగుల వెడల్పుతో రోడ్డు విస్తరణ, అభివృద్ధి చేయడం, అజీం హోటల్ నుంచి చర్చి గేట్ వరకు (షోహెబ్ హోటల్ నుంచి బాలాపూర్ రోడ్ వరకు 80 అడుగుల వెడల్పు రోడ్డు విస్తరణ, అభివృద్ధి, చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్ నుంచి చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ మీదుగా బార్కాస్ రోడ్ వరకు 60 అడుగుల రహదారి విస్తరణ, అభివృద్ధి, లక్కీ స్టార్ హోటల్ నుంచి ఫూల్‌బాగ్ మీదుగా హఫీజ్‌బాబానగర్ వరకు 60, 40 అడుగుల వెడల్పు గల రహదారిని విస్తరించడం, అభివృద్ధి చేయడం, బండ్లగూడ నుంచి ఎర్రకుంట వరకు రోడ్డు విస్తరణపై ప్రతిపాదనలు సిద్ధం చేశారు. హఫీజ్ బాబానగర్ జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం, బండ్లగూడ జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్, ఒవైసీ జంక్షన్ వద్ద ఎడమ వైపు డౌన్ ర్యాంపు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.