IPL | సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో జరుగాల్సిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు ఎందుకు రద్దయ్యాయి..? విజయనగరంలో బయటపడ్డ బాంబు పేలుళ్ల కుట్రకు ఈ ఐపీఎల్ మ్యాచ్‌ల రద్దుకు ఏమైనా సంబంధాలున్నాయా? దేశ ద్రోహం కేసు ఎదుర్కొంటున్న హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసుకు ఏమైనా లింక్లున్నాయా? ఐపీఎల్ మ్యాచ్‌ల రద్దుపై ప్రజలలో భిన్న రకమైన చర్చలు జరుగుతున్నాయి.
ఇప్పటి వరకు నిర్వహించిన క్రికెట్ మ్యాచ్‌ల బందోబస్తుకు రాచకొండ పోలీసులకు మంచిమార్కులొచ్చాయి. అలాగే హైదరాబాద్‌కు క్రికెట్ అసోసియేషన్ సైతం నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని చెప్పినా.. హైదరాబాద్‌లో జరుగాల్సిన క్రికెట్ మ్యాచ్‌లను రద్దు చేసి, వాటిని మరో వేదికపై ఎందుకు నిర్వహిస్తున్నారని చర్చించుకుంటున్న సమయంలోనే హైదరాబాద్‌లో ఉగ్ర కుట్రకు విజయనగరం నుంచి భారీ స్కెచ్ వేశారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఉగ్ర కుట్రకు, ఐపీఎల్ మ్యాచ్‌ల రద్దుకు లింక్లున్నాయనే వాదన వినిస్తున్నది.
ఇంకా మూడు మ్యాచ్‌లు..
ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 10న సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత నైట్ రైడర్స్ మ్యాచ్, 20న ఫస్ట్ క్వాలిఫైయర్ మ్యాచ్, 21న ఎలిమినేటర్ మ్యాచ్ జరుగాల్సి ఉంది. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో ఐపీఎల్-2025ని వారం రోజుల పాటు వాయిదా వేస్తూ ఈ నెల 9న బీసీసీఐ ప్రకటించింది. ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించగానే బీసీసీఐ మ్యాచ్‌ల నిర్వహణపై చర్చించుకొని, 17 నుంచి పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ ప్రకటనతో పాటే మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌ల వేదికల్లో మార్పులను కూడా వెల్లడించింది. అందులో హైదరాబాద్‌లో జరుగాల్సిన మూడు మ్యాచ్‌ల వేదికలు మారాయి. హైదరాబాద్‌లో జరుగాల్సిన మూడు మ్యాచ్‌లను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది..? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌తో పాటు రాచకొండ పోలీసులు నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని బీసీసీఐకి చెప్పినట్లు తెలిసింది. అప్పటి వరకు ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఆరు క్రికెట్ మ్యాచ్‌లకు నిర్వహించిన బందోబస్తుపై రాచకొండ పోలీసులను ఐపీఎల్ నిర్వాహకులు ప్రశసించినట్లు అధికారులు తెలిపారు. అయినా కూడా హైదరాబాద్‌లో మ్యాచ్‌లకు ఎందుకు చోటివ్వలేదనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఎవరెవరిని కలిశారో..
విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రహమాన్, సికింద్రాబాద్‌కు చెందిన సమీర్‌లను విజయనగరం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సోషల్‌మీడియా వేదికగా ఒక్కటైన ఇరువురు దేశ వ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నినట్లు విచారణలో బయటపడింది. బోయిగూడకు చెందిన సమీర్ లిఫ్ట్ మెకానిక్‌గా పనిచేస్తూ కొన్ని సామాజిక సేవ కార్యక్రమాల పేరుతో యువకులను ఆకర్షించినట్లు సమాచారం. రాత్రి వేళల్లో చాలా మంది యువకులతో గ్రూప్ మీటింగ్‌లు పెడుతూ ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్నాడనే విషయం విచారణలో వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఇద్దరు మరికొంత మందితో దేశ వ్యాప్తంగా సోషల్‌మీడియా వేదికగానెట్వర్క్ను భారీగా పెంచుకున్నారు.
బాంబులు తయారు చేసి వాటిని విజయనగరం ప్రాంతంలోని అడవుల్లో ఈ నెల 21, 22వ తేదీల్లో పేల్చి రిహార్సల్స్ చేయాలనుకున్నారు. ఎక్కువ మొత్తంలో టిఫిన్ బాంబులు తయారు చేసి వాటిని హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రధాన నగరాలలో పేల్చి బీభత్సం సృష్టించేందుకు కుట్ర చేశారనే విషయం విచారణలో తేలింది. ఇందులో ప్రధానంగా హైదరాబాద్ ప్రస్తావన రావడం, సికింద్రాబాద్‌కు చెందిన సమీర్ నిర్వహించిన గ్రూప్ మీటింగ్‌లకు చాలా మంది యువకులు హాజరైనట్లు సమాచారం రావడంతో నిఘా సంస్థలు ఆరా తీస్తున్నాయి.
అయితే హైదరాబాద్‌కు ఉగ్ర ముప్పు ఉండే అవకాశాలను ముందుగానే నిఘా సంస్థలు గుర్తించి ఇక్కడ మ్యాచ్‌ల నిర్వాహణను రద్దు చేసుకోవాలని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, మరికొంత మంది పాకిస్తాన్‌కు సహకరిస్తుండడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో యూట్యూబర్ జ్యోతి హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వీడియోలు తీసింది.. ఆమె కూడా అరెస్ట్ కావడం గమనార్హం.
ఉగ్రకుట్రకు స్కెచ్..
హైదరాబాద్‌లో గతంలో జరిగిన ఉగ్రవాద ఘటనల నేపథ్యం ఉండడం, ఆపరేషన్ సిందూర్ తరువాత స్లీపర్ సెల్స్, ఉగ్రసానుభూతి పరులు యాక్టివేట్ అయ్యే అవకాశాలపై నిఘా సంస్థలు హెచ్చరించిన నేపధ్యంలోనే క్రికెట్ మ్యాచ్‌ల నిర్వాహణకు హైదరాబాద్ సరైన వేదిక కాదని నిర్వాహకులుభావించారా? అనే సందేహాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఉగ్రకుట్రకు విజయనగరం నుంచి స్కెచ్ వేశారని వెలుగులోకి రావడంతో ఆ సందేహాలు నిజమనే వాదన విన్పిస్తోంది. నిఘా సంస్థలు ముందుగానే హెచ్చరించడంతోనే బీసీసీఐ ఇక్కడ మ్యాచ్‌ల నిర్వహణను రద్దు చేసి ఉండవచ్చని క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు.