Hyderabad | కేపీహెచ్‌బీ కాలనీ, ఆగస్టు 12 : హైటెక్‌సిటీ కూతవేటు దూరంలో ఓ ఇంట్లోకి చోరబడ్డ దుండగులు.. ఆ ఇంట్లో నివసిస్తున్న వృద్దదంపతులపై దాడి చేసి.. బంగారం, వెండి ఆభరణాలు.. నగదును దోచుకెళ్లిన సంఘటన కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా, తాడిపల్లిగూడెం మండలం, అట్లపాడు గ్రామానికి చెందిన కొల్లా నాగేశ్వర్రావు (90) తహసీల్దార్‌గా సేవలందించి.. ఉద్యోగ విరమణ చేశాడు. భార్య సరస్వతి(80), ఐదుగురు ఆడపిల్లలు సంతానం. ప్రభుత్వ ఉద్యోగ విరమణ చేసిన తర్వాత సుమారు 32 సంవత్సరాల క్రితం.. కేపీహెచ్‌బీ కాలనీలోని 7వ ఫేజ్‌లో ఎంఐజీ 14 ఇంటిని కోనుగోలు చేసి.. అందులో నివాసం ఉంటున్నాడు. రోజూ మాదిరిగానే సోమవారం కూడా నాగేశ్వర్ రావు దంపతులు ఇంటికి సెంట్రల్‌లాక్ వేసుకుని పడుకున్నారు.
సోమవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి సెంట్రల్లాక్ను సెంట్రింగ్ రాడ్, స్క్రూ డ్రైవర్ సహాయంతో తెరిచి( తొలగించి) ఇంట్లోకి చొరబడ్డారు. వచ్చీ రాగానే నాగేశ్వర్రావు ముఖంపై పిడిగద్దులు గుద్దగా అతని నోట్లోని దంతాలు రాలిపోయాయి. అరవకుండా ఉండేందుకు నోట్లో గుడ్డలు కుక్కి.. మంచంపై పడేశాడు. మరో వ్యక్తి సరస్వతిపై దాడి చేసి.. కిందపడేశాడు. ఆమె మెడలోని బంగారు గొలుసు, చేతి కడాలు లాక్కొన్నారు. తర్వాత మంచంపై పడేసి.. మాట్లాడితే ప్రాణాలు తీస్తామని హెచ్చరించారు.
వారిద్దరి వద్ద.. ఒకరు కాపలాగా ఉండగా…మరో ఇద్దరు బెడ్రూంలోకి చోరబడి.. బీరువా, లాకర్ తాలాలను తెరిచారు. దేవుడి గదిలో బంగారు, వెండి విగ్రహాలు తీసుకున్నారు. ఇంట్లోని అన్ని ప్రాంతాలలో వెతికి దొరికింది దోచుకుని పారిపోయారు. వెంటనే పక్కనే ఉన్న ఎంఐజీ 13లో దొంగతనం చేయడం కోసం ఇంటి తలుపులు తీస్తుండగా…వారు మెల్కొని కాలనీలోని పలువురికి ఫోన్ చేయడంతో పాటు.. పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయాన్ని పసిగట్టిన దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ చోరీలో 30 తులాల బంగారం, 70 తులాల వెండి, 3లక్షల నగదు దొంగతనం జరిగినట్లు పేర్కొన్నారు. ఈ సంఘటన తెలిసిన వెంటనే కూకట్పల్లి ఏసీపీ ఈ రవికిరణ్‌రెడ్డి, కేపీహెచ్‌బీ కాలనీ సీఐ రాజశేఖర్‌రెడ్డిలతో పాటు క్లూస్ టీంలు చేరుకుని దొంగతనం జరిగిన తీరును, సీసీ కెమెరాలను పరీశీలించారు.