సిటీబ్యూరో/చార్మినార్, మే 19(నమస్తే తెలంగాణ): గుల్జార్‌హౌస్ వద్ద అగ్ని ప్రమాదం జరిగిన శ్రీ కృష్ణ పెరల్స్ భవనం మంటల తీవ్రతకు లోపలి భాగం తునాతునకలైంది. ఎటుచూసినా పగుళ్లే కనిపిస్తున్నాయి. అసలు భవనంలోపల మూడుఫ్లోర్లలో ఎక్కడా ఒక్క వస్తువు కూడా మిగలలేదు. మంగళవారం అగ్ని ప్రమాద సంఘటనాస్థలానికి క్లూస్, ఫోరెన్సిక్ టీమ్స్ వచ్చాయి. భవనం లోపల విచారణ చేపట్టిన ఈ బృందాలు మొత్తం భవనంలో 14 ఏసీలు ఉన్నట్లుగా గుర్తించారు.
ఘటనాస్థలంలో పేలిపోయినట్లుగా చెబుతున్న ఏసీ కంప్రెషర్ కొన్ని భాగాలను క్లూస్ టీమ్ సేకరించారు. ఆ తర్వాత ఘటన జరిగిన ఫ్లోర్లను పరిశీలించారు. ఘటనకు సంబంధించిన కొన్ని ప్రాథమిక ఆనవాళ్లను సేకరించినట్లు తెలిసింది. ఫోరెన్సిక్ నిపుణులు మూడుగంటలపాటు భవనమంతా తిరిగి కొన్ని ఆనవాళ్లను సేకరించి తమతో తీసుకెళ్లారు.
శ్రీకృష్ణ పెరల్స్ మూడంతస్తుల భవనం పూర్తిగా డామేజ్ అయినట్లుగా గుర్తించిన అధికారులు ఈ భవన నిర్మాణంపై అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇరుకైన ప్రదేశంలో 7 ఏసీలు నిరంతరం వాడకం వల్ల ప్రమాదం జరిగిందని, ఏసీ ఎక్సాస్టర్కు సరైన సౌకర్యం లేనందునే కంప్రెషర్ పేలినట్లుగా చర్చ జరుగుతోంది. అక్రమ కనెక్షన్లతో అధిక ఏసీలు వాడకంతో పాటు ఇరుకైన ప్రదేశంలో అత్యధికంగా విద్యుత్ వినియోగం జరిగినట్లుగా గుర్తించారు.
పంచనామా పూర్తయ్యేదెప్పుడు..!
గుల్జార్‌హౌస్ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించిన పంచనామాను పూర్తిచేయడంలో పోలీసులు తాత్సారం చేస్తున్నారు. ఇప్పటివరకు కుటుంబసభ్యులను విచారించిన పోలీసులు సంఘటనకు గల కారణాలపై అంచనాకు రాలేకపోతున్నారు. అగ్ని ప్రమాదం జరగడానికి షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణమని మొదట్లో చెప్పిన ఫైర్ అధికారులు ఆ తర్వాత ఆ విషయంలో నోరు విప్పడం లేదు. ఈ ప్రమాదంలో షార్ట్ సర్క్యూట్‌కు సంబంధించిన ఆనవాళ్లేవీ లేవని విద్యుత్‌శాఖ తేల్చిచెప్పింది. దీంతో అసలు మంటలు రావడానికి కారణాలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.
గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు మొదలై మిగతా రెండంతస్తులకు వ్యాప్తి చెందాయని, అయితే గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు ఎలా వచ్చాయనే విషయంలో సందిగ్దత నెలకొందని పోలీసులు చెప్పారు. గ్రౌండ్ ఫ్లోర్లో వైర్లు కూడా కనిపించలేదని, మంటలు ఎక్కడ మొదలయ్యాయనే కోణంలో ఫోరెన్సిక్, క్లూస్ టీమ్‌ల సహకారంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పోలీసు పంచనామా బుధవారం పూర్తవుతుందని అధికారులు చెప్పారు. ఘటనజరిగిన మూడురోజులకు కూడా పోలీసుల దర్యాప్తు ముందుకు సాగకపోవడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు సమాచారం. ఇక ప్రమాదం నుంచి బయటపడిన నలుగురు వ్యక్తులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.
ఆరుగురు అధికారులతో కమిటీ: మంత్రి పొన్నం
గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ఘటనపై సమగ్ర విచారణ కోసం ఆరుగురు అధికారులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాదంలో భారీగా ప్రాణ నష్టం జరిగడంతో లోతైన దర్యాప్తు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని ఇది వరకే సీఎం ప్రకటించారు. అందులో భాగంగా తాజాగా కమిటీలోని అధికారుల పేర్లను జిల్లా మంత్రి ప్రకటించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, కలెక్టర్ అనుదీప్ దురశెట్టి, పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్‌లు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నట్లు మంత్రి తెలిపారు.
అగ్నిమాపక శాఖ లోతైన దర్యాప్తు
గుల్జార్ హౌజ్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై అగ్నిమాపక శాఖ లోతైన దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రమాదానికి గురైన భవనంలో ఎన్ని గదులున్నాయి, ఎంత ఎత్తుంది, ఎంత వెడల్పు ఉంది అనే అంశాలపై మంగళవారం అధికారులు వివరాలు సేకరించారు. ఆదివారం ప్రమాదం జరగడంతో సోమవారం వరకు కూడా భవనంలోకి వెళ్లేందుకు అధికార యంత్రాంగానికి వీలుకాలేదు. భవనానికి సంబంధించిన మ్యాప్‌లను వేసి ప్రమాదం జరిగిన తీరును విశ్లేషించనున్నారు.