సిటీబ్యూరో, మే 14 (నమస్తే తెలంగాణ) : డీఎస్పీ పార్థసారధి ఇంట్లో లభ్యమైన బుల్లెట్ల వ్యవహారంపై హయత్‌నగర్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డీఎస్పీ తన ఇంట్లో వాటిని ఎందుకు దాచిపెట్టాడు అనే విషయంపై స్పష్టత రావాలంటే ఆయనే నోరు విప్పాల్సి ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. సూర్యాపేట డీఎస్పీగా పని చేస్తున్న పార్థసారథి, సూర్యాపేట్ ఇన్స్పెక్టర్ వీరరాఘవులు ఓ దవాఖానకు సంబంధించిన సెటిల్మెంట్ విషయంలో రూ.16లక్షలు లంచం డిమాండ్ చేసి ఏసీబీకి పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఇరువురిని ఏసీబీ ఇప్పటికే అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో హయత్‌నగర్‌లోని డీఎస్పీ ఇంట్లో ఏసీబీ మంగళవారం సోదాలు నిర్వహించగా.. వివిధ రకాలైన అక్రమ ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభించాయి. వాటితోపాటు అక్రమంగా ఇంట్లో దాచిపెట్టిన 21 లైవ్ రౌండ్లు, 69 ఖాళీ కాట్రిడ్జ్‌లు, కాట్రిడ్జ్ల స్టాండ్‌ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
దీనిపై ఏసీబీ ఇచ్చిన ఫిర్యాదుతో హయత్‌నగర్ పోలీసులు అక్రమ ఆయుధాలు చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాధారణంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గతంలో పనిచేసిన అధికారులు అప్పట్లో బుల్లెట్లను వాడుతూ ఎప్పటికప్పుడు లెక్కలు చెబుతూ ఉండేవారు. ఎవరైనా వాటిని ఇంట్లో పెట్టి మర్చిపోయే వారు సైతం ఉండే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు. అలా కాకుండా వీటితో ఏమి చేయాలనుకున్నారు.. సోదాలలో లభించిన లైవ్‌రౌండ్లు ఎక్కడివి, ఎప్పుడు తీసుకున్నాడు, ఖాళీ కాట్రిడ్జ్‌లపై పోలీసులు భిన్నకోణాలలో ఆరా తీస్తున్నారు. గతంలో పార్థసారధి ఎక్కడెక్కడ పనిచేశాడు, అక్కడ ఏమైనా పాత కేసులున్నాయా? దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా? అనే విషయాలపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఏసీబీ అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. దీంతో హయత్‌నగర్ పోలీసులు పీటీ వారెంట్‌పై తాము అదుపులోకి తీసుకొని పార్థసారధిని విచారించే అవకాశాలున్నాయి.