సిటీబ్యూరో, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): రేషన్ కార్డుల పంపిణీపై ప్రభుత్వం రోజుకో ప్రకటనతో ప్రజలను ఊరిస్తున్నది. తాజాగా మార్చి 1న ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో పంపిణీ చేస్తామని ప్రకటించారు. కానీ పౌరసరఫరాల శాఖ అధికారులకు మాత్రం ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ ప్రకటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించారు. 15 నెలలు దాటుతున్నా నేటికీ దరఖాస్తుల స్వీకరణతోనే కాలయాపన చేస్తుండటంతో తాజా ప్రకటనతోనూ లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. అంతేగాకుండా తమను మభ్యపెట్టడానికే సాగదీస్తున్నారని అర్హులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ మార్చి 1 నుంచి పంపిణీ ప్రారంభిస్తే.. రేషన్ కార్డుల అప్లికేషన్లలోని సమస్యలు పరిష్కరించకుండా ఎవరికి? ఏ ప్రాతిపదికన ఇస్తారనే ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి.
పరిశీలన దశలోనే అప్లికేషన్లు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రేషన్ కార్డుల కోసం అర్హులు నాలుగు సార్లు దరఖాస్తు చేసుకున్నారు. తొలుత ప్రజా పాలనలో, రెండోసారి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత ప్రజావాణిలో చేసుకున్నారు. చివరగా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించడంతో అటువైపు పరుగులు తీశారు. ఇలా పలు సార్లు చేసిన దరఖాస్తులు ఈ నెల 25 నాటికి లక్షా 25,600 దరఖాస్తులు అందాయి. పౌర సరఫరాల శాఖ అధికారులు వచ్చిన దరఖాస్తులను వచ్చినట్లుగా పరిశీలించి అర్హులను గుర్తిస్తున్నారు. అయినా ఈ ప్రక్రియ పూర్తవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ తరుణంలో ప్రభుత్వం మార్చి నుంచి ఎంత మందికి పంపిణీ చేస్తుందో? ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకొని పంపిణీ చేస్తుందనే ప్రశ్నలు తలెత్తున్నాయి.
కొంత మంది ఇండ్లకు వెళ్లని సర్వే అధికారులు
జీహెచ్ఎంసీ, పౌర సరఫరాల, రెవెన్యూ శాఖల అధికారులు హైదరాబాద్ వ్యాప్తంగా సర్వే చేసి అర్హులను గుర్తించారు. సంబంధిత నివేదికను కూడా జిల్లా సివిల్ సప్లై శాఖ కార్యాలయంలో సమర్పించారు. కానీ కొంత మంది దరఖాస్తుదారులు తమ ఇండ్ల వద్దకు సర్వే అధికారులు రాలేదని చెబుతున్నారు. అయితే వెరిఫికేషన్ కాని వారికి రేషన్ కార్డులు వస్తాయా? రావా? అనే ఆందోళనలో దరఖాస్తుదారులు ఉన్నారు. సర్వే పూర్తి కాకముందే అధికారులు నివేదిక సమర్పించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రాతిపదికన సర్వే చేశారో అర్థం కాక సతమతమవుతున్నారు. తమ ఇంటికి సర్వేకు కూడా రాకముందే రేషన్ కార్డులను ఎలా పంపిణీ చేస్తారని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. దీన్ని బట్టి రేషన్ కార్డుల పంపిణీలో ప్రభుత్వానికే స్పష్టత లేదని విమర్శిస్తున్నారు. అర్హులను గుర్తించడంలో నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా ఎలా పంపిణీ చేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్పష్టత ఇవ్వని ప్రభుత్వం.. అయోమయంలో అర్హులు
రేషన్ కార్డుల పంపిణీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే గందరగోళం నెలకొంది. దరఖాస్తు ప్రక్రియ, అర్హులను గుర్తించడం, దరఖాస్తుల స్వీకరణలో నేటికీ ప్రభుత్వానికి స్పష్టత లేదని హైదరాబాద్ ప్రజలు విమర్శిస్తున్నారు. రోజుకో ప్రకటన, పద్ధతి లేకుండా దరఖాస్తుల స్వీకరణతో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విషయం తేలిపోయిందని దరఖాస్తుదారులు బాహటంగానే పేర్కొంటున్నారు. మరోవైపు దరఖాస్తుల స్వీకరణలో మీసేవ నిర్వాహకులకు సరైన గైడ్లైన్స్ ఇవ్వకపోవడంతో ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని వాపోతున్నారు. అటు పౌర సరఫరాల శాఖ అధికారులకు కూడా కొత్తవారి చేరిక, పాతవారి తొలగింపుపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడంతో వారు తలలు పట్టుకుంటున్నారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో మార్చి 1 నుంచి రేషన్ కార్డుల జారీ సాధ్యమేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం సరైన మార్గదర్శకాలు జారీ చేసి అసలైన అర్హులను గుర్తించి రేషన్ కార్డులను జారీ చేయాలని నిరుపేదలు కోరుతున్నారు.