Pocharam Municipality | ఘట్కేసర్, సెప్టెంబర్ 9: ఓ వ్యక్తి తన ఇంట్లో నీటి బోరు వేసుకునేందుకు అనుమతి కోరగా.. రెవెన్యూ సిబ్బంది రూ.50 వేలు డిమాండ్ చేశారు. డబ్బుల కోసం ఇబ్బందులు పెట్టడంతో రూ.35 వేలు ఇచ్చిన బాధితుడు.. సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. తన నుంచి రెవెన్యూ సిబ్బంది లంచంగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరాడు.
బాధితుడి కథనం ప్రకారం.. పోచారం మున్సిపాలిటీ కొర్రెముల ప్రాంతంలోని లక్ష్మీనగర్ కాలనీలో నివాసముండే సోలిపురం చంద్రశేఖర్‌రెడ్డి తన ప్లాట్‌లో ఇంటి అవసరాల కోసం నీటి బోరును తొవ్విస్తుండగా.. విషయం తెలుసుకున్న ఘట్కేసర్ రెవెన్యూ అధికారుల తరఫున ప్రైవేటు వ్యక్తులు వచ్చి..రూ. 50వేలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే బోరు వేయడాన్ని అడ్డుకుంటామని ఇబ్బందులకు గురిచేశారు.
బాధితుడు చంద్రశేఖర్‌రెడ్డి రూ.35 వేల నగదును తాను రెవెన్యూ సిబ్బందినంటూ వచ్చిన మల్లేశ్‌కు ఇచ్చాడు. ఆర్ఐ సాయిరాం వద్ద మల్లేశ్ పనిచేస్తున్నారు. ఈ విషయమై బాధితుడు సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, ఆర్ఐపై చర్యలు తీసుకుంటామని, ఈ వ్యవహారంపై విచారణ చేయాల్సిందిగా కలెక్టర్ ఆర్డీవోను ఆదేశించారని బాధితుడు తెలిపాడు. అధికారులు విచారణ చేసి, తాను లంచంగా ఇచ్చిన రూ.35 వేలను తిరిగి ఇప్పించాలని కోరాడు.