ముషీరాబాద్, జనవరి 24: నగరంలో చేపల అమ్మకాలకు కేంద్రమైన ముషీరాబాద్ మార్కెట్లో చేతివాటం అడ్డు అదుపూ లేకుండా కొనసాగుతున్నది. వినియోగదారుల్లో కొరవడిన అవగాహన వల్ల కొందరు అమ్మకం దారులకు అవకాశంగా మారుతోంది. ఫలితంగా చేపల అమ్మకాల్లో చేతివాటం కొసాగుతుండగా వినియోగదారులు దోపిడీకి గురవుతున్నారు. తూనికలు కొలతల శాఖ అధికారులు అడపా దడపా తనిఖీలు చేస్తూ తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేసినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న వారికి నామమాత్రపు జరిమానాలు విధిస్తుండటంతో తూనికల శాఖ అధికారుల హెచ్చరికలు, దాడులను వ్యాపారులు ఖాతరు చేయడం లేదు.
తూకాల్లో మోసాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించే చట్టాలు లేకపోవడంతో నామమాత్రపు చర్యలు తూకాల్లో చేతివాటాన్ని కట్టడి చేయలేకపోతున్నాయి. తూకాల్లో మోసాలకు తావులేకుండా ఉండటానికిగాను అంతా ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు ఏర్పాటు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉన్నా పట్టించుకోకపోవడంతో కొందరు చేపల వ్యాపారుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నది. ముషీరాబాద్ చేపల మార్కెట్లో తాజా, ఏ రకమైన చేపలు కావాలన్నా దొరుకుతాయనే నమ్మకంతో వినియోగదారులు రాజధాని నలుమూలల నుంచి ఎంతో ప్రయాసపడి ఇక్కడికి వస్తుంటారు. అయితే సరసమైన ధరకు తాజా చేపలు దొరుకుతాయని మార్కెట్‌కు వస్తే కొందరు వ్యాపారులు తూకాల్లో దండికొడుతుండటంతో కొనుగోలుదారుల మోసపోతున్నారు.

Fish
కిలో చేపలు కొంటే కేవలం 650 గ్రాములు, రెండు కిలోల చేపలు కొంటే 1400 గ్రాముల చొప్పున తూకాల్లో మోసాల గుట్టు వెల్లడైంది. ఇక చిరు వ్యాపారులు ఇక్కడి మార్కెట్లో చేపలు కొనుగోలు చేసి నగరంలోని ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి అమ్మకాలు సాగిస్తుంటారు. వీరు సైతం తూకాల్లో మోసాలకు గురవుతున్నారు. ఒకేసారి 10 కిలోల చేపలు కొంటే కేవలం 7, 8 కిలోల చేపలు వస్తుంటాయి. ఇలా ఎన్ని కిలోల చేపలు కొంటే అంతే స్థాయిలో తూకాల్లో మోసాల తంతు కొనసాగుతున్నది.
ఎవరైనా తూకాల్లో మోసాలపై, తూకపు రాళ్ల గురించి ప్రశ్నిస్తే నీ ఇష్టం ఉంటే తీసుకో లేకపోతే పో అంటూ దురుసుగా సమాధానం ఇస్తుంటారు. మార్కెట్లో హోల్‌సెల్ వ్యాపారులు పెద్దగా మోసాలకు పాల్పడుతున్న ఘటనలు లేకపోగా చిన్న వ్యాపారులే చేతివాటానికి పాల్పడుతున్నట్లు తూనికలు కొలతల శాఖ అధికారుల దాడుల్లో వెల్లడవుతోంది. మార్కెట్లో రోజు 15 నుంచి 20 టన్నులు, ఆదివారం 20 నుంచి 30 టన్నుల చేపల విక్రయాలు జరుగుతాయి. రవ్వులు, బొచ్చలు, కొరమీను, రోయ్యలు వంటి చేపలు అత్యధికంగా అమ్ముడవుతుండగా ఇతరత్రా సముద్రపు చేపలు సైతం అమ్ముడవుతుంటాయి.
మోసాలు ఇలా…
చేపలు అమ్మకం దారులు కొందరు తుకపురాళ్ల ఆకృతిని(బరువును తగ్గించి) మార్చి మోసాలకు పాల్పడుతున్నారు. తూకపు రాళ్ల కింది భాగాన్ని రౌండ్‌గా కట్ చేసి ఆ తరువాత దానిపై పలుచని ఇనుప రేకును అతికిస్తూ వెల్డింగ్ చేస్తారు. ఇది చూడటానికి ఎవరికి ఏ మాత్రం అనుమానం రాకుండా కనిపిస్తుంది. ఇక్కడే వియోగదారులు తూకపు రాళ్లలో మోసాలను గుర్తించక పప్పులో కాలేస్తుంటారు. ఎవరైనా తూకపు రాళ్ల గురించి ఆరా తీస్తే వెంటనే రాయి(బాటు) మార్చి అసలైన రాయిని పెట్టి తూకం వేస్తుంటారు.