సిటీబ్యూరో, జూలై 25 (నమస్తే తెలంగాణ): రుతుపవనాలకు తోడు బంగాళఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో గత 3 రోజులుగా నగరాన్ని వాన ముసురుకుంది. అయితే కొన్ని చోట్ల ముసురు కురుస్తుండగా మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
శుక్రవారం రాత్రి 10గంటల వరకు షేక్‌పేటలో అత్యధికంగా 2.0సెం.మీలు, కూకట్‌పల్లిలో 1.80సెం. మీలు, గచ్చిబౌలిలో 1.73సెం.మీలు, యూసుఫ్‌గూడలో 1.70సెం. మీలు బోరబండలో 1.68సెం.మీలు. లింగంపల్లిలో 1.60సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు. రాగల మరో రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.