మల్కాజిగిరి, నవంబర్ 26: బీసీల సంక్షేమానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బోయిన్పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బీసీ కులాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన విధి విధానాలను 2001వ సంవత్సరలో జరిపిన జన గణనతో పాటు సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. బీసీల రిజర్వేషన్ యాబై శాతానికి మించరాదని గెజిట్లో ఉన్న అంశాన్ని గుర్తు చేస్తున్నామన్నారు.
బీసీల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 70 శాతం ఉన్న బీసీలకు 50 శాతం రిజర్వేషన్ను ఎందు కు పరిమితం చేశారని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం పునః సమీక్షించి బీసీలకు న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వాలు బీసీలను గుర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కుల గణన నిర్వహించాలన్నారు. బీసీల చైతన్యమే లక్ష్యంగా కులాలకు అతీతంగా పోరాటం చేస్తామన్నారు. శాసన సభలో బీసీల గొంతుకను వినిపించడంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల జాతీయ, రాష్ట్ర నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.