ఎల్బీనగర్ ( హైదరాబాద్ ) : మూసీ (Moosi) పరివాహకంలోని ఇండ్లను కూల్చాలంటే తమను దాటి వెళ్లాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి (MLA Sudhir Reddy) అన్నారు. ప్రజలకు అండగా ఉండి మూసి కూల్చివేతలను అడ్డుకుంటామని భరోసా ఇచ్చారు. ఆదివారం కొత్తపేట డివిజన్లోని జనప్రియ అవెన్యూ అపార్ట్మెంట్ సముదాయం, చైతన్యపురి డివిజన్ సత్యనగర్ కాలనీలో నిర్వహించిన సమావేశాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీ పరివాహకంలోని ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ నాయకులు అందుబాటులో ఉంటారని, ప్రజలకు ఎలాంటి హాని జరుగనివ్వబోమని అన్నారు. 1964 ప్రాంతంలో ఇక్కడి ప్రజలు మూసీ నీరు త్రాగేవారని, అంత స్వచ్ఛంగా నీరు ఉండేదని అన్నారు.
ఎమ్మార్డీసీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలోనే మూసీ ప్రక్షాళన ప్రారంభించానని అన్నారు. మూసీ నీటిని శుద్ధి చేసేందుకు 32 ఎస్టీపీలను ప్రారంభించామని, వాటిలో కొన్ని పూర్తయ్యాయని అన్నారు. ప్రజలను ఇబ్బందులు పెడతామంటే, ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతామంటే తాము ఒప్పుకోమని వెల్లడించారు.