సికింద్రాబాద్, జనవరి 17: ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నిలబడి ధైర్యంగా గొంతు విప్పి మాట్లాడుతున్న మేధావులు, ప్రజా నాయకులు, కళా నేతల మీద సామాజిక మాధ్యమాల్లో అసభ్య పద జాలంతో దూషిస్తూ అనాగరిక దాడులు చేస్తున్న మాలలు తమ పద్ధతిని మార్చుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేశ్ మాదిగ హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్ కళాశాల ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగతో కలిసి ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ న్యాయమైనది కాబట్టే.. లోకమంతా ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతుందన్నారు.
వర్గీకరణను వ్యతిరేకిస్తూ సమాజంలో ఏకాకిగా నిలబడుతున్నది కేవలం మాలలు మాత్రమేనని అన్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు గీత గీసి న్యాయం వైపు, ధర్మం వైపు నిలబడ్డవాడే నిజమైన వీరుడిగా, మేధావిగా నిల్చుతారని, ఇప్పుడు అలాంటి పాత్రనే డా. పృథ్వీరాజ్ యాదవ్, తెలంగాణ విఠల్, విమలక , డా. దరువు అంజన్న, సయ్యద్ ఇస్మాయీల్, నల్గొండ గద్దర్, రేలారే గంగ, తీన్మార్ మల్లన్న వంటి నాయకులు, అలాగే, ఎంఎల్సీ ప్రొ. కోదండరాం, జయప్రకాశ్ నారాయణ, ప్రొ. హరగోపాల్, ప్రొ. నాగేశ్వర్ రావు, కె.శ్రీనివాస్, నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్, వి.ప్రకాశ్ వంటి మేధావులు పోషిస్తున్నారని అన్నారు.
వారి నిబద్ధతకు, వారి ధైర్యానికి మాదిగ జాతి, అలాగే సమాజం జేజేలు పలుకుతుందన్నారు. వారిని కంటికి రెప్పలా మాదిగ జాతి కాపాడుకుంటుంది. ఎన్నో సమస్యలకు పరిషారాలు చూపి దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న మేధావుల మీద బండబూతులతో దాడులు చేయడం మాలలు చేస్తున్న సిగ్గుమాలిన చర్య అని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సోషల్ మీడియా తెలంగాణ అధ్యక్షులు ఇనుముల అనిల్ మాదిగ, ఎమ్మార్పీఎస్ హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి రొట్టెల సునీల్ మాదిగ, ఎంఎస్ఎఫ్ సీనియర్ నాయకులు సామ్రాట్ అజయ్ మాదిగ, హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దావు ఆదిత్య మాదిగ, బొల్లికొండ వేణు మాదిగ, నర్వ దాసు మాదిగ, మంద అనీల్ మాదిగ, వంశీ మాదిగ, ప్రదీప్ మాదిగ, సైదులు మాదిగ, హరి ప్రసాద్ మాదిగ తదితరులు పాల్గొన్నారు