ఖైరతాబాద్, డిసెంబర్ 13: రవీంద్రభారతిలో దివంగత సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ప్రతిష్ఠాపనను అడ్డుకుంటామని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుల్తాన్ యాదగిరి అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ గౌరవ అధ్యక్షుడు తుమ్మల ప్రఫూల్ రాంరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఉద్యమకారులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిలబెట్టుకోలేదన్నారు. ఉద్యమకారులకు పింఛన్లు చెల్లించకుండా తాత్సారం చేస్తున్న ప్రభుత్వం.. అందాలు, క్రీడా పోటీలకు వందలాది కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. మా డిమాండ్ల విషయంలో ఈనెల 9వ తేదీలోపు ప్రభుత్వం నుంచి ప్రకటన రాకుంటే తీవ్ర ఉద్యమకార్యాచరణ రూపొందిస్తామని 3న జరిగిన శ్రీకాంతాచారి వర్థంతి సందర్భంగా ప్రతినబూనామన్నారు.
అయితే మేమిచ్చిన గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదని, దీంతో మా కార్యాచరణను ప్రారంభిస్తున్నామన్నారు. రవీంద్రభారతిలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ప్రాణాలకు తెగించి అయినా అడ్డుకుంటామన్నారు. స్థానికేతరుల విగ్రహాలను గడ్డపారలతో కూలగొడతామన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరవాలని, ఉద్యమకారులకు ఇస్తామన్న 250 గజాల స్థలం, రూ.25వేల పింఛను వెంటనే అందించాలని, అమరవీరుల స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని, వారి కుటుంబాలకు ఆరోగ్యభద్రత కార్డు, ఉచిత బస్‌పాస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, రామగిరి ప్రకాశ్, అంజి రెడ్డి, జానకి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.