సిటీబ్యూరో: ప్రత్యేక ఓటరు సవరణలో తప్పిదాలు జరిగితే ఊరుకోబోమని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. గురువారం తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మారావు నగర్లోని సర్ కేంద్రాన్ని సందర్శించారు. కార్యక్రమం నిర్వహణ తీరు, సిబ్బంది విధులు, ఓటరు మ్యాపింగ్ విధానంపై ఏఈఆర్వో సుజాత సంబంధిత అధికారులు తలసానికి వివరించారు. సర్ కార్యక్రమంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, ప్రజలు కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తలసాని కోరారు.
సర్ కార్యక్రమంలో సాంకేతికత అనుభవం కలిగిన సిబ్బందిని నియమించాలని, ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. స్వీపర్లను కూడా సర్ కార్యక్రమంలో సిబ్బందిగా నియమించినట్లు మా దృష్టికి వచ్చిందని, యాప్ను డౌన్లోడ్ చేయడం, వివరాలు నమోదు చేయడం వంటి విషయాలలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. ఓటరు ప్రత్యేక సవరణ కార్యక్రమంలో ప్రజలకు బీర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉంటారని, వారి సహకారాన్ని తీసుకోవాలని కోరారు.