సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిరాసక్త వైఖరి, యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తామని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ గ్రేటర్ హైదరబాద్ జోన్ ఆధ్వర్యంలో శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రీసోర్స్ సెంటర్లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా థామస్ రెడ్డి మాట్లాడుతూ.. కార్మికులకు రావాల్సిన 2021 వేతన సవరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీలో యూనియన్ల పునరుద్ధరణ వెంటనే చేయాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన విలీన ప్రక్రియపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంపై బలమైన పోరాటానికి యూనియన్ స్థాయి కమిటీల నిర్మాణంపై కూలంకషంగా చర్చించినట్టు వివరించారు. ఆర్టీసీలో థర్డ్ పార్టీ ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, నిర్వహణ ఆర్టీసీయే చేయాలని స్పష్టం చేశారు. కన్సాల్టేటెడ్ పేరు మీద నియామకాలు ఆపివేయాలని చెప్పారు.
ప్రతినెలా సిబ్బంది రిటైర్ అవుతున్నా నియామకాలు చేపట్టకుండా చోద్యం చూస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు వర్క్ షాప్‌ల తరలింపును తక్షణమే విరమించుకోవాలని తీర్మానం చేశారు. కార్యక్రమంలో టీఎంయూ వర్కింగ్ ప్రెసిడెంట్ కమలాకర్, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డీఎస్ లక్ష్మయ్య, గ్రేటర్ హైదరాబాద్ జోనల్ కమిటీ ప్రెసిడెంట్ సంపత్, సుశీల్ కుమార్, ఆర్ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.