మియాపూర్ , ఫిబ్రవరి 11 : ట్రాఫిక్ సమస్య నివారణ, ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తున్నామని విప్ అరెకపూడి గాంధీ తెలిపారు. ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న మోర్ సూపర్ మార్కెట్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయించి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. నిజాంపేట నుంచి సమతానగర్లోకి వెళ్లేందుకు రోడ్డు నిర్మాణం కోసం మోర్ సూపర్ మార్కెట్ వద్ద లింక్ రోడ్డును జీహెచ్ఎంసీ అధికారులు, కార్పొరేటర్ శ్రీకాంత్తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. జాతీయ రహదారిపై కొంత మేరకు ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అధికారులు వెంటనే పనులు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఈఈ గోవర్ధన్, ఏఈ రాజీవ్, శ్రావణ్, పార్టీ నేతలు పాల్గొన్నారు.