దుండిగల్ మే10: దుండిగల్ మున్సిపాలిటీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ఉమ్మడిరంగారెడ్డి జిల్లాఎమ్మెల్సీ,మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్‌రాజు అన్నారు. దుండిగల్ మున్సిపాలిటీ 12వ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ సుంకరి కృష్ణవేణికృష్ణ అధ్యక్షతన మంగళవారం జరిగింది.ఈ సమావేశానికి ఎమ్మెల్సీ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా రూ,10కోట్ల 83లక్షల 40వేల నిధులతో అభివృద్ధి చేయనున్న గండిమైసమ్మ చౌరస్తా,మల్లంపేట్, బౌరంపేట, గాగిల్లా పూర్,బహదూర్‌పల్లిలో వర్షపునీటి కాలువల ఏర్పాటు,మల్లంపేట్, గాగిల్లాపూర్, బహదూర్‌పల్లిలో వాటర్ ట్యాంక్‌ల ఏర్పాటు,శ్మశాన వాటికల అభివృద్ధి, అదే విధంగా మున్సిపల్ పరిధిలో నెలకొన్న విద్యుత్ సమస్య,డ్రైనేజీ లైన్లు,తాగునీటి పైపులైన్లు,రోడ్లు ఏర్పాట్లపై చర్చించారు.అనంతరం ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలోని ప్రధాన జంక్షన్ల అభివృద్ధిపై దృష్టి సారించారని,అందులో భాగంగా భవిష్యత్‌లో ట్రాఫిక్ సమస్య అవసరాలను దృష్లిలో ఉంచుకుని గండిమైసమ్మ చౌరస్తాను విస్తరించనున్నామని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ దూర దృష్టితో నగరం చుట్టు పక్కల నీటి ప్రాజెక్ట్‌లను నెలకొల్పారని,వాటిని అధికారులు సద్వినియోగం చేసుకునేందుకు నీటి ట్యాంక్‌ల నిర్మాణం చేపట్టాలన్నారు.గతంలో నిర్వహించిన పట్టణ ప్రగతిలో అనేక అభివృద్ధి పనులు పూర్తిచేయడం జరిగిందని,ఈ నెల 20న తిరిగి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో చేపట్టాల్సిన పనులపై ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలన్నారు. దుండిగల్ మున్సిపాలిటీలో అభివృద్ది పనులకు నిధులు లేమి లేకుండా పూర్తయ్యేలా సహకరిస్తానని, రాబోయే రోజుల్లో మున్సిపాలిటీని అభివృద్ధికి కేంద్ర బిందువుగా తీర్చిదిద్దడానికి అధికారులు కృషి చేయాలన్నారు.ఈ సమావేశంలో వైస్ చైర్మన్ తుడుం పద్మారావు, గండిమైసమ్మ-దుండిగల్ మండలం తహసీల్దార్ భూపా ల్, మున్సిపల్ మేనేజర్ సునంద,డీఈ చిరంజీవులు,ఏఈ నవీన్‌కుమార్,కౌన్సిలర్లు,సిబ్బంది ఉన్నారు. కాగా సమావేశానికి హాజరు కాని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.