Gold | బంజారాహిల్స్,ఆగస్టు 10: హిమాలయాల్లో దొరికే అరుదైన వనమూలికలతో తయారు చేసిన భస్మంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తే బంగారం సృష్టిస్తామంటూ నమ్మించిన ముఠా వ్యవహారంలో మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండ్రోజుల క్రితం ముఠాలోని ఇద్దరు సభ్యులను అరెస్ట్ చేసిన బంజారాహిల్స్ పోలీసులు తాజాగా మరో నిందితుడిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎన్బీటీనగర్లో నివాసం ఉంటున్న రత్లావత్ గోపాల్‌సింగ్ అనే వ్యక్తి కూలీపనులు చేసుకుంటాడు.
నెలరోజుల క్రితం ఎమ్మెల్యే కాలనీలోని ఏసీబీ కార్యాలయం ఎదురుగా నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఓ కారులో నలుగురు వ్యక్తులు స్వామీజీల వేషధారణలో వచ్చారు. రోడ్డుమీద వెళ్తున్న గోపాల్‌సింగ్‌తో మాటలు కలిపారు. నీవు విపరీతమైన కష్టాల్లో ఉన్నావని, హిమాలయాల్లో దొరికే కొన్ని మూలికలకు సంబంధించిన భస్మాన్ని ఉపయోగించి పూజలు చేస్తే బంగారం తయారవుతుందని నమ్మబలికారు.
మూలికలకు సంబంధించి భస్మం నిజాంపేటలోని గద్వాల్ ఆయుర్వేదిక్ సెంటర్లో దొరుకుందని చెప్పారు. దీంతో తనకు తెలిసినవారికి సైతం ఈ విషయాన్ని గురించి చెప్పడంతో వారు కూడా కొంతడబ్బులు అందించారు. దీంతో పలు దఫాలుగా రూ.10లక్షల దాకా చెల్లించాడు. నెలరోజుల పాటు పూజలు నిర్వహించిన అనంతరం ఇటీవల అతడికి కొన్ని నకిలీ బంగారం బిస్కెట్లను అందజేశారు. వారంరోజుల పాటు ఇంట్లో ఎరుపురంగు వస్త్రంలో తామిచ్చిన బంగారం బిస్కెట్లను ఉంచి పూజించాలని, తర్వాతనే పూర్తి స్తాయిలో 2కేజీల బంగారంగా మారుతుందని చెప్పారు.
వారంరోజుల తర్వాత మరో 7లక్షలు ఇవ్వాలంటూ స్వామీజీల వేషధారణలో ఉన్న వ్యక్తులు చెప్పడంతో అనుమానం వచ్చిన బాధితులు పూజలో పెట్టిన బంగారాన్ని పరిశీలించగా ఇనుపముక్కలమీద బంగారం పెయింట్ వేసి మోసగించినట్లు తేలింది. ఈ మేరకు బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు రెండ్రోజుల క్రితం నిజాంపేటలోని గద్వాల్ ఆయుర్వేదిక్ సెంటర్లో పనిచేస్తున్న సుధీర్‌కుమార్ సింగ్, సాగర్ అనే వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
తాజాగా ఇదే ముఠాలోని సభ్యుడిగా పనిచేస్తున్న పంకజ్ అనే వ్యక్తిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని తెలుస్తోంది. కాగా ఇదే రీతిలో నాగోల్‌లో సైతం మహాలక్ష్మి ఆయుర్వేదిక్ సెంటర్ పేరుతో కేంద్రాన్ని నిర్వహిస్తూ భస్మాల పేరుతో మోసం చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అక్కడ పనిచేస్తున్న మహేష్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా తమను మోసం చేసిన ముఠా సభ్యులను పట్టుకుని తమకు న్యాయం చేయాలంటూ బాధితుడు గోపాల్‌సింగ్‌తో పాటు కుటుంబసభ్యులు బంజారాహిల్స్ పోలీసులను కోరారు.
నాగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ముఠా..?
భస్మాలతో పూజ ద్వారా 2కేజీల బంగారాన్ని తయారు చేస్తామంటూ నమ్మించిన బోగస్ స్వామీజీల వ్యవహారంలో కీలక సూత్రధారులందరూ మహారాష్ట్రలోని నాగపూర్ ప్రాంతానికి చెందినవారని పోలీసుల దర్యాప్తులో తేలింది. సహదేవ్ అనే వ్యాపారి నాగపూర్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి పలు ప్రాంతాల్లో ఆయుర్వేదిక్ ఉత్పత్తుల పేరుతో షాపులు ఏర్పాటు చేసినట్లు తేలింది. షాపుల్లో సిబ్బందిని నియమించుకుని వేర్వేరు రకాలైన ఆయుర్వేద ఉత్పత్తులతో పాటు వనమూలికల భస్మాలను ఆమ్ముతున్నారు.
కాగా నగరంలో స్వామీజీ వేషధారణలో కొంతమంది వ్యక్తుల ద్వారా పూజలు చేయిస్తామని నమ్మించి తమ షాపుల్లో భస్మాలు కొనిపిస్తున్నారని, ఈ డబ్బులను పంకజ్ అనే వ్యక్తి ఆయా షాపులనుంచి సేకరిస్తుంటాడని తెలుస్తోంది. నిజాంపేటలోని గద్వాల్ ఆయుర్వేదిక్ సెంటర్, నాగోల్‌లోని మహాలక్ష్మి ఆయుర్వేదిక్ సెంటర్లలో భస్మాల పేరుతో సుమారు నెలకు 2 కోట్లకు పైగా వసూలు చేస్తున్నారని తెలుస్తోంది.ఈ ముఠాలోని కీలక సూత్రధారి సహదేవ్‌తో పాటు స్వామీజీల వేషధారణలో మోసాలకు పాల్పడుతున్న వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ ముఠా పలువురిని మోసం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.