హైదరాబాద్ : సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఎంజీ రోడ్లో గల మహాత్మాగాంధీ విగ్రహం సర్కిల్ సుందరీకరణ పనులను 6 నెలల్లో పూర్తి చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గురువారం వివిధ శాఖల అధికారులతో కలిసి గాంధీ విగ్రహం పరిసరాలలో పర్యటించి ఆ ప్రాంత అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు.
ప్రస్తుతం ఉన్న గాంధీ విగ్రహ ప్రాంతంలో అదనంగా మరో గాంధీ విగ్రహాన్ని నూతనంగా ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే విగ్రహం తయారీ కోసం అధికారులు ఆర్డర్ చేసినట్లు వివరించారు. అంతేకాకుండా కాకుండా పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లను అక్కడి నుంచి తరలించి వెనుకవైపు, పక్కన మరికొంత స్థలాన్ని సేకరించి మొక్కలు, అత్యంత సుందరంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
ఈ ప్రాంత అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలపై అధికారులు రూపొందించిన నమూనాను మంత్రికి వివరించారు. మంత్రి వెంట జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీ ముకుంద రెడ్డి,ఈఈ సుదర్శన్, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, ఎస్ఈ అనిల్, వాటర్ వర్క్స్ జీఎం రమణారెడ్డి, ఎలెక్ట్రికల్ డీఈ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.