ఖైరతాబాద్, మే 29 : లంబాడీల ఓట్లతో గద్దెనెక్కి ఆ జాతిని మోసగించిన కాంగ్రెస్‌ను వదిలేది లేదని లంబాడీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు గణేశ్ నాయక్ హెచ్చరించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తుందని, కానీ ఇప్పటి వరకు లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకపోగా, వారిని పూర్తిగా విస్మరించారన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో 45 శాతం లంబాడీ, గిరిజనులే ఉన్నారని, వారి ఓట్లతోనే నేడు సీఎం సీటు మీద కుర్చున్నారని, కృతజ్ఞత లేకుండా ఆ తెగలను కించపరుస్తూ, కనీసం ప్రభుత్వంలో ఏ ఒక్క నామినేట్ పదవి కూడా ఇవ్వకుండా అవమానపరుస్తున్నారన్నారు. పదవులన్నింటినీ రేవంత్ రెడ్డి సామాజికవర్గానికే కట్టబెడుతున్నారని, కాంగ్రెస్ మేనిఫెస్టోకు విరుద్ధంగా పోవడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలందరినీ మోసగించారన్నారు.
ఏఐసీసీ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే రేవంత్ రెడ్డిని సీఎం కుర్చి నుంచి దింపాలని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా లంబాడీలందరూ నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేపడుతారన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి లంబాడీలకు ఇస్తే అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. త్వరలో జరుగబోయే మంత్రివర్గ విస్తరణలో లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకుంటే గ్రామాలు, తండాల్లో కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను అడుగు పెట్టనివ్వబోమన్నారు.
24 గంటల్లో ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని, లేని పక్షంలో 6న యాదగిరిగుట్టకు వస్తున్న రేవంత్ రెడ్డిని అడుగడుగునా అడ్డుకుంటామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లంబాడీలను మోసగించడాన్ని నిరసిస్తూ 8న గాంధీభవన్ వద్ద లంబాడీ హక్కుల పోరాట సమితి మహిళా విభాగం ఆధ్వర్యంలో చీరెలు, గాజులతో లక్షలాది మంది గిరిజనులతో నిరసన ధర్నా చేపడుతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కార్యనిర్వహక అధ్యక్షుడు వెంకట్ బంజారా, ఎల్‌హెచ్‌పీఎస్ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ పున్ని బాయి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనితా బాయి, ఉపాధ్యక్షురాలు దేవిబాయి, వసంతబాయి తదితరులు పాల్గొన్నారు.