జూబ్లీహిల్స్, సెప్టెంబర్ 3: ప్రజలకు.. కుటుంబ సమేతంగా వినోదాన్ని అందించే ఏకైక సాధనం టెలివిజన్ కార్యక్రమాలని.. ఆయా ప్రసారాల్లో తెర వెనుక కీలకపాత్ర పోషించే టీవీ కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం యూసుఫ్‌గూడ శ్రీకృష్ణానగర్‌లో తెలుగు టెలివిజన్- డిజిటల్ మీడియా టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నూతన భవనాన్ని మంత్రి తలసాని, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేలాదిగా ఉన్న టీవీ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ వర్తింపజేస్తామని.. ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలను అందిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా టీవీ ఫెడరేషన్ విజ్ఙప్తి మేరకు 24 క్రాఫ్ట్‌ల టీవీ కార్మికుల కార్యాలయాలన్నీ ఒకేచోట ఏర్పాటు చేసుకునేందుకు 1500 గజాల స్థలాన్ని ప్రభుత్వం తరఫున ఇచ్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హామీ ఇచ్చారు. టీవీ ఫెడరేషన్ అధ్యక్షుడు కె.రాకేశ్, ప్రధాన కార్యదర్శి పి.విజయ్‌కుమార్, కోశాధికారి కె.నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూసుఫ్‌గూడ డివిజన్ కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్, తెలుగు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం, ఫెడరేషన్ వ్యవస్థాపకులు నాగబాల సురేశ్ కుమార్, నిర్మాతల మండలి అధ్యక్షులు ఎ.ప్రసాదరావు , ఫెడరేషన్ ఉపాధ్యక్షులు పి.మురళి, మోహన్‌రాజ్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.