సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ వార్డు పరిధిలోని పలు కాలనీల్లో రూ.74.50 లక్షల వ్యయంతో తాగునీటి పైపులైన్ పునరుద్ధరణ పనులకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గురువారం శంకుస్థాపన చేశారు. ఎన్బీటీ నగర్, ఎన్బీ బస్తీ, గ్రీన్ బెల్ట్ పారు, బోలానగర్ కాలనీలలో సీవరేజీ పైపులైన్ల ద్వారా తరచుగా నీటి కాలుష్యం అవుతున్న నేపథ్యంలో సురక్షిత తాగు నీరు అందించేందుకు పైపులైన్ పునరుద్ధరణ పనులను చేపడుతున్నట్లు మేయర్ వివరించారు. సంబంధిత ప్రాంతాలను పరిశీలించి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని వాటర్ వర్స్ తట్టి ఖానా సెక్షన్ అధికారులను ఆదేశించారు.
ముందుగా మేయర్ రేష్మ బాగ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి ఎన్బీటీనగర్ వరకు 150 మిల్లీ మీటర్ల పైపులైన్ వేయుటకు రూ.58 లక్షల అంచనా వ్యయంతో చేపట్టే తాగునీటి పైపులైన్ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్బీ బస్తీలో 100 మిల్లీ మీటర్ల పైపులైన్ కోసం రూ. 9 లక్షల వ్యయంతో, గ్రీన్ బెల్ట్ పార్, బోలానగర్ కాలనీలలో 100 మీటర్ల పైపులైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్బీటీ నగర్లో చేపడుతున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్స్ జనరల్ మేనేజర్ హరిశంకర్, డీజీఎం శ్రీనివాస్, తట్టి ఖానా సెక్షన్ డివిజన్ మేనేజర్ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.