సుల్తాన్ బజార్,మార్చి 8: వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలతో పోటీపడేలా ఎదగాలని సీఎం రేవంత్‌రెడ్డి విద్యార్థులకు సూ చించారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని పోటీలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో రూ.535కోట్ల నిధులతో నూతన భవన నిర్మాణాలు, చారిత్రాత్మకమైన పురావస్తు కట్టడాల పునరుద్ధరణ పనులకు గాను ఆయన, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, రాజ్యసభ సభ్యులు అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎం కుమార్, మహిళా వర్సిటీ బీసీ ప్రొఫెసర్ సూర్య ధనుంజయ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డిలతో కలిసి భూమి పూజ చేసి నూతన భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. అంతకు ముందు వర్సిటీ ఎన్సీసీ విద్యార్థులు సీఎం రేవంత్‌రెడ్డికి గౌరవ వందనం సమర్పించారు.దర్భార్ హాల్లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ఆయన తిలకించారు.
అనంతరం వర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన సభా వేదికపై మంత్రులు అధికారులతో కలిసి వచ్చి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు, కళాశాల ప్రిన్సిపాల్లు, లెక్చరర్లు, అధ్యాపకులు, బోధన బోధనేతర సిబ్బంది, పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి, అడిషనల్ డీసీపీ నర్సయ్య, సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్, సుల్తాన్ బజార్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసచారి లతో కలిసి బందోబస్తును పర్యవేక్షించారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం తృటిలో తప్పింది. కాగా, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య భూమి పూజ చేసిన అనంతరం ఇటుకలను పేర్చే క్రమంలో ఒక్కసారిగా గుంతలో పడిపోతుండగా.. వెంటనే తేరుకున్న సీఎం అక్కడి నుంచి వెళ్లిపోయారు.