సిటీ బ్యూరో, జనవరి 10 (నమస్తే తెలంగాణ): నివాసాల మధ్య శ్మశాన వాటికను నిర్మించి ఇబ్బందులు కలిగించొద్దని ఎర్రగడ్డలోని బ్రిగేడ్, కల్పతరు, వాసవి గేటెడ్ కమ్యూనిటీ వాసులు నిరసనకు దిగారు. తమ అపార్ట్మెంట్ల వెనుక ఉన్న ఖాళీ స్థలాన్ని ప్రభుత్వం ఖబరస్థాన్‌కు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై తాము కోర్టులో కేసు వేశామని, కోర్టు స్టేటస్ కో విధించిందని వెల్లడించారు. కోర్టు స్టేటస్ కో ఇచ్చినా ఆదేశాలను ఉల్లంఘిస్తూ వక్ఫ్‌బోర్డు, రెవెన్యూ అధికారులు ఆ ప్రాంతంలో ఖబరస్థాన్‌కు అనుమతులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు.
ప్రభుత్వం అన్నదమ్ముల్లా కలిసి ఉన్న తమ మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తుందన్నారు. నిరసనలో కల్పతరువు మాజీ అధ్యక్షుడు లయన్ డా. చేకూరు హనుమంతు నాయుడు, బ్రిగేడ్ సిటాడెల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, మాజీ అధ్యక్షుడు విష్ణువర్ధన్,ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షుడు చుక్కన రాజు, శ్యాం కుమార్, రమేశ్ బాబు, సుధాకర్ రావు, వాసవి బృందావనం ప్రెసిడెంట్ హనుమంతరావు, కల్పతరువు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు పవన్ కుమార్, వైశాలి, రాహుల్ నగర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.