Sajjanar | టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉందని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పెండింగ్ అంశాలను దశల వారీగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని టీజీఎస్ఆర్టీసీ కళాభవన్లో రాష్ట్రస్థాయి ఎంప్లాయ్ వెల్పేర్ బోర్డు సభ్యులతో యాజమాన్యం మంగళవారం సమావేశమైంది. ఈ సమావేశానికి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి ఆయన వెల్పేర్ బోర్డు సభ్యుల నుంచి సూచనలు, సలహాలను స్వీకరించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. నిబద్ధతతో పనిచేస్తూ ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తోన్న ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం ప్రాధాన్యం ఇస్తోందని, ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లింపు, 21 శాతం ఫిట్మెంట్తో 2017 పీఆర్సీ, 2013 ఆర్పీఎస్ బాండ్ల డబ్బుల విడుదలతో పాటు పెండింగ్ డీఏలను మంజూరు చేసిందని తెలిపారు. విధి నిర్వహణలో మరణించిన 2,350 మంది సిబ్బంది కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలను కల్పించామని వివరించారు. మెడికల్ అన్ ఫిట్ అయిన మరో 537 మందికి ఉద్యోగాలిచ్చామని వెల్లడించారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా ప్రతి ఉద్యోగికి హెల్త్ టెస్ట్ లు చేశామని, ఫలితంగా 726 మంది ఉద్యోగులకు, 184 మంది ఉద్యోగుల జీవిత భాగస్వామ్యులను ప్రాణాప్రాయం నుంచి సంస్థ కాపాడిందని గుర్తు చేశారు.
మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన పనిభారాన్ని తగ్గించేందుకు తాత్కాలికంగా డ్రైవర్, కండక్టర్ పోస్టులకు నియామకాలు చేపడుతుంటే.. కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీలో 3,036 రెగ్యులర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, సాంకేతిక కారణాల వల్ల నియామక ప్రక్రియలో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. ఆ నియమాకాలు కచ్చితంగా జరుగుతాయని, అందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. తమ మనుగడ కోసం ఐదారు నెలలుగా కొందరు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నా.. ఉద్యోగులు ఎంతో సమయమనంతో ఉన్నారని చెప్పారు. ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ కొనుగోలు చేసేలా అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని అన్నారు. యాజమాన్యం తీసుకునే నిర్ణయాల వెనుక ఉద్యోగుల, సంస్థ ప్రయోజనాలే ఉంటాయో తప్ప.. ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలు ఉండవని అన్నారు. ప్రతి నిర్ణయం చాలా పారదర్శకంగానూ, సంస్థ నియమ నిబంధనలకు లోబడే ఉంటుందని వివరించారు. యాజమాన్యానికి, సిబ్బందికి వెల్పేర్ బోర్డు సభ్యులు అనుసంధానకర్తల్లాగా పనిచేయాలని సూచించారు. ప్రతి సమస్యను పై అధికారుల దృష్టికి స్వేచ్ఛగా తీసుకురావాలన్నారు.