సిటీబ్యూరో/ఖైరతాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ రోడ్లు అకస్మాత్తుగా కుంగిపోతున్నాయి. భూకంపం వచ్చిందా అన్న తీరుగా రోడ్డు కుంగిపోతుండడంతో ప్రజలు భయాంందోళనకు గురవుతున్నారు. ఎక్కడ, ఎప్పుడు రోడ్డు కుంగిపోతుందో అని అందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది బంజారాహిల్స్ ఉదయ్ నగర్లో నాలా పై కప్పు కూలింది.. తాజాగా మంగళవారం బంజారాహిల్స్ రోడ్ నం.1లో మహేశ్వరి టవర్స్ వద్ద ఇలాంటి ఘటనే జరిగింది.
మహేశ్వరి టవర్స్ అపార్ట్‌మెంట్‌కు నీటి సరఫరా చేసేందుకు ఎస్కే సంస్థకు చెందిన 10వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకర్ వచ్చింది. అపార్ట్‌మెంట్‌కు పది అడుగుల దూరంలో ఒక్కసారిగా పెద్ద శబ్ధం చేస్తూ భూమిలో కుంగిపోయింది. దీంతో డ్రైవర్, క్లీనర్లు అప్రమత్తమై డోర్ తెర్చుకొని బయటకు దూకడంతో ప్రాణాలు దక్కాయి. ఉదయం కావడం..జన సంచారం పెద్దగా లేకపోవడంతో ప్రాణనష్టం వాటిల్లలేదు. అయితే ఈ పురాతన నాలా కావడం ఒకవైపు, మరోవైపు సోమవారం కురిసిన కుండపోత వర్షానికి రోడ్డు కుంగినట్లు ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు.
గతంలో గోషామహల్లో దారుసలామ్ నుంచి చాక్నివాడికి వెళ్లే మార్గంలో పురాతన నాలా ఇదే మాదిరిగా ఐదు సార్లు కుంగడం గమనార్హం. నగరంలో డ్రైనేజీ, నాలాలు చాలా వరకు ఎప్పుడో నిర్మించినవి కావడంతోనే ఈ సమస్య ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే మహేశ్వరీ టవర్స్ వద్ద జరిగిన ప్రమాదం నాసిరకం రోడ్డు వేయడమే కారణమంటూ స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
బంజారాహిల్స్ రోడ్ నం. 1 నుంచి మహేశ్వరి టవర్స్ వెళ్లేందుకు ఓ లింకు రోడ్డు ఉంది. 90 శాతం రోడ్డు కింద పది అడుగుల లోతులో భారీ నాలా ఉంది. ప్రమాదం జరిగినప్పుడు దాదాపుగా వాటర్ ట్యాంకర్ నాలాలో కుంగిపోయింది. ఆ గొయ్యి ట్యాంకర్ మందం ఉండడంతో చుట్టు పక్కల వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రమాద సమయంలో ట్యాంకర్లో సుమారు పది వేల లీటర్ల నీరు ఉంది. సోమవారం సాయంత్రం కురిసిన కుండపోత వర్షానికి అండర్ గ్రౌండ్ నాలాలో వరద ఉధృతి పెరిగి కుంగిపోయి ఉంటుందని భావిస్తున్నారు.
కాగా, మహేశ్వరి టవర్స్ వద్ద మంగళవారం ఉదయం 5గంటల సమయంలో వాటర్ ట్యాంకర్ నాలాలో కూరుకుపోగా, 10గంటల సమయంలో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది వచ్చి ఫొటోలు తీసుకొని వెళ్లారని, తక్షణ సహాయక చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం కంచె కూడా ఏర్పాటు చేయలేదన్నారు. ఖైరతాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆటు వైపు వెళ్లకుండా పహారా ఏర్పాటు చేశారు.
అపార్ట్‌మెంట్‌కు పది అడుగుల దూరంలో..
ఖైరతాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నం.1లో ఉన్న మహేశ్వరి టవర్స్ అపార్ట్‌మెంట్‌కు నీటి సరఫరా మంగళవారం ఎస్కే సంస్థకు చెందిన వాటర్ ట్యాంకర్ వచ్చింది. అపార్ట్‌మెంట్‌కు పది అడుగుల దూరంలో ఒక్కసారిగా పెద్ద శబ్ధం చేస్తూ భూమిలో కుంగిపోయింది. దీంతో డ్రైవర్, క్లీనర్లు అప్రమత్తమై డోర్ తెర్చుకొని బయటకు దూకడంతో ప్రాణాలు దక్కాయి. మహేశ్వరి టవర్స్ వద్ద జరిగిన ఘటనతో ఒక్కో లోపాలు వెలుగులోకి వస్తున్నాయి.
మూడు దశాబ్దాల కిందట అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ నిర్మాణం జరిగినట్లు చెబుతున్నారు. బంజారాహిల్స్‌లోని పలు కాలనీల ద్వారా వరద నీరు బంజారా లేక్ (గుండ్ల చెరువు)లోకి చేరుతాయి. భారీ వర్షాలు కురిసినప్పుడు ఆ వరద నీటిని తరలించేందుకు గతంలో ఇక్కడ నాలా నిర్మించారు. వరదనీరు మహేశ్వరి టవర్స్ లేన్ మీదుగా ప్రేమ్‌నగర్, చింతలబస్తీ, తుమ్మలబస్తీలో ఉన్న బుల్కాపూర్ నాలా మీదుగా ఎస్టీపీకి చేరుతాయి.
30 ఏండ్ల కిందటే..
ఈ నాలాపై 30 సంవత్సరాల కిందటే కమర్షియల్ కాంప్లెక్సులు, బహుళ అంతస్తుల భవనాలు, ఇండిపెండెంట్ గృహాలు నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది. అప్పటి ప్రభుత్వం, అధికారులు నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి నాలాపై భవనాల నిర్మాణాలకు అనుమతినిచ్చి ప్రమాదానికి బాటలు వేసినట్లు ఆరోపణలు వినిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న మహేశ్వరి టవర్స్ లేన్ మొత్తం ఈ నాలా విస్తరించి ఉన్నట్లు చెబుతున్నారు. భారీ వర్షాలు వస్తే ఈ నిర్మాణాలు మొత్తం నేలమట్టమై ఆస్తి, ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు దశాబ్దాల కిందట ఉన్న సర్కారు, అధికారులు చేసిన తప్పిదాల వల్ల తమ ప్రాణాలకు సంకటంగా మారిందంటున్నారు. ఇప్పటికైనా నాలాను క్రమబద్ధీకరించాలని కోరుతున్నారు.
మేయర్‌కు శాపనర్థాలు..
బంజారాహిల్స్ రోడ్ నం.1లోని మహేశ్వరి టవర్స్‌లో సుమారు 150 ఫ్లాట్ ఉన్నాయి. వీటితో పాటు అనేక కమర్షియల్, ఇండింపెండెంట్ భవనాలు ఉన్నాయి. మంగళవారం నాలా కుంగిపోయి, వాటర్ ట్యాంకర్ దిగబడడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. ఇక్కడ జలమండలి ద్వారా వచ్చే నీరు ఎంత మాత్రం సరిపోదు. ఆ నీరు సైతం అత్యంత లోప్రెషర్స్లో వస్తుంటాయని, దాని ద్వారా ఒక్క కుటుంబ అవసరం కూడా తీరదని నివాసితులు చెబుతున్నారు.
ప్రతి రోజూ కనీసం పది ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరిగితేనే తమ అవసరాలు తీరుతుందంటున్నారు. మేయర్‌కు అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఫలితంగా వందలాది కుటుంబాలు నీటి కోసం గోసపడాల్సిన పరిస్థితి నెలకొందని, ఎన్నికల ముందు ఓట్లు అడగేందుకు మేయర్ వస్తారంటూ..శాపనార్థాలు పెట్టారు. ఎమ్మెల్యే ఉన్నా ఎన్నడూ పట్టించుకోరని మండిపడుతున్నారు.
వరుసగా కుంగుతున్నా…
జీహెచ్ఎంసీ పరిధిలో వరద నీటి కాలువల పొడవు 1302 కిలోమీటర్ల మేర ఉండగా…390 కిలోమీటర్లు మేజర్ నాలా, మైనర్ డ్రైయిన్స్ 912 కిలోమీటర్లు మేర ఉన్నాయి. ప్రతి ఏటా మాదిరిగానే వరద నీరు సాఫీగా దిగువకు వెళ్లేందుకు పునరుద్ధరణ, మరమ్మత్తులు చర్యలు, పురాతన నాలాలను జీహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. అయితే వరుసగా పురాతన నాలాలపై ఉన్న రోడ్లు కుంగుతూ ప్రజలను కలవరానికి గురి చేస్తున్నాయి. గతంలో గోషామహల్, హిమాయత్‌నగర్, ఎంజీబీఎస్-చాదర్‌ఘాట్ మెయిన్‌రోడ్డుపై, ఎన్టీఆర్ గార్డెన్ ముందు, కూకట్‌పల్లిలోని ఉషా ముళ్లపూడి రోడ్డు గోవింద్ హోటల్ చౌరస్తా ,బంజారాహిల్స్ రోడ్ నం 9లోఉప్పల్ జాతీయ రహదారిపై రోడ్డు అకస్మాత్తుగా కుంగిపోయింది. వరుస సంఘటనలు జరుగుతుండడంతో జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ , హైడ్రా విభాగం పురాతన నాలాలపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
మేయర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు..
ఈ రోడ్డు కింద నాలా ప్రమాదకరంగా ఉందని గతంలోనే మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి ఫిర్యాదు చేశాం. కానీ పట్టించుకోలేదు. మా అపార్ట్‌మెంట్‌కు నీటి సరఫరాకు ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు. కేవలం ఏడాది పొడవునా వాటర్ ట్యాంకర్లే తమకు దిక్కు. 30 ఏండ్లుగా నీటికి గోస పడుతున్నాం. కనీస అవసరాలు తీరాలంటే ట్యాంకరే మాకు దిక్కు. 150 ఫ్లాట్స్‌లలో సుమారు ఆరు వందలకు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. మాకు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపలేదు. – దిలీప్, స్థానికుడు
నెలకు 3లక్షలకు పైగానే..
మా భవనాలకు ఏడాదంతా వాటర్ ట్యాంకర్ల ద్వారానే నీటి సరఫరా జరుగుతుంది. అత్యధికంగా కమర్షియల్ భవనాలు ఉండడం వల్ల ప్రతి రోజూ కనీసం పది ట్యాంకర్ల నీరు సరఫరా కావాల్సిందే. కేవలం ట్యాంకర్లకే నెలకు రూ.3 లక్షల వరకు ఖర్చవుతోంది. జలమండలి ద్వారా వచ్చే నీరు సరిపోదు. నాలా కుంగిపోయి రోడ్డు మొత్తం మూసుకుపోయింది. మా వాహనాలు బయటకు రావాలంటే ఇతర సరైన మార్గాలు లేవు. అధికారులు సకాలంలో స్పందించలేదు. సాయంత్రం వరకు కూడా ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదు. – అస్లం, స్థానికుడు
సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం
చాలా సంవత్సరాల కిందట నిర్మించి ఉండడం వల్ల నాలాపై ఉన్న స్లాబ్ నాణ్యత దెబ్బతినడం వల్లే కుంగిపోయింది. సహాయక చర్యలు చేపడుతున్నాం. ప్రమాదం ఇంకా విస్తరించకుండా చర్యలను చేపడుతున్నాం. నాలా స్లాబ్ మార్పు, కొత్త స్లాబ్ నిర్మాణం తదితర సాధ్యాసాధ్యాలను పరిశీస్తున్నాం. నాలా విస్తరణ, వైశాల్యం తదితర అంశాలపై రికార్డులను పరిశీలిస్తున్నాం.
– సమ్మయ్య, జూబ్లీహిల్స్ సర్కిల్