Hyderabad | మాదాపూర్, ఫిబ్రవరి (నమస్తే తెలంగాణ)13 : వేసవికాలం ప్రారంభోత్సవంలోనే ప్రజలకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రజలకు తాగు నీరు సరిపడా రాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవికాలం ప్రారంభ దశలోనే నీటి సమస్య తీవ్రంగా ఉంటే ఎండలు ముదిరాక పరిస్థితి ఎంత జఠిలంగా మారుతుందోనని పలు కాలనీల ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నారని, అవి కూడా తక్కువ ప్రెషర్ తో కేవలం 20 నిమిషాలు మాత్రమే రావడంతో నీటికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని హఫీజ్‌పేట్‌లోని ఆదిత్యనగర్, సుభాష్ చంద్రబోస్ నగర్, ప్రేమ్ నగర్ కాలనీలలో పాటు చుట్టూ ప్రక్కల ప్రాంత ప్రజలు వాపోతున్నారు.
మంచినీటి సమస్య పెరుగుతుండటంతో కాలనీలకు సరిపడ నీరు అందడం లేదని, జలమండలి అధికారులు కాలనీ వాసులకు తాగునీటిని అందించడంలో మొదట్లోనే విఫలమవుతే మున్ముందు పరిస్థితేమిటని ఆందోళన చెందుతున్నారు. జల మండలి అధికారులు ప్రజల సమస్యలు తీర్చడంపై దృష్టి సారించి కాలనీలకు వాటర్ ట్యాంకర్లను సరఫరా చేయాలని కోరుతున్నారు.
గుక్కెడు నీటి కోసం నీటి పంపుల వద్ద గంటల తరబడి ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. తమ గోడు పట్టించుకునే నాధుడే కరవయ్యారని అంటున్నారు. ఇదిలా ఉండగా గురువారం నమస్తే తెలంగాణ బృందం నీటి సమస్యపై పలు కాలనీలో మహిళలను సంప్రదించగా వేసవి కాలం రాక ముందే కాలనీలకు సరిపడ నీరు రావడం లేదని, నీరు సరిపోక ట్యాంకర్ల ద్వారా తెప్పించుకునే దుస్థితి తలెత్తిందని ఓ వైపు చెప్పడంతో అదే విషయంపై జలమండలి సిబ్బందిని సంప్రదించగా కాలనీలకు సరిపడ నీళ్లు అందుతున్నాయని, నీటితో ఎటువంటి ఇబ్బందులు లేవని తమకేమీ పట్టనట్లుగా చెబుతున్నారు.
వేసవి సమస్యపై జీఎం బ్రిజేస్ను ఫోన్లో సంప్రదించగా తమకేమీ పట్టనట్లుగా సమాధానం చెప్పారు. ఎక్కడ ఎన్ని ట్యాంకర్లను పంపుతున్నారు. ట్యాంకర్ బుక్ చేసిన తరువాత ఎన్ని గంటలకు డెలివరీ ఇస్తున్నారు. రెండు డివిజన్లలో కలిపి ఎన్ని ఫీలింగ్ స్టేషన్లు ఉన్నాయి, బల్క్ కనెక్షన్లు ఎన్ని, అందులో ఉచిత కనెక్షన్లు ఎన్ని, నీటి కలుషితం ఏమైనా ఉందా, నీటి కొరత ఏ ఏ కాలనీలో అధికంగా ఉందని ఆరా తీసేందుకు ప్రయత్నించగా అందుకు సంబంధించిన వివరాలు మాకు ఇవ్వడానికి ఉండదు. ప్రధాన కార్యాలయంలో పీఆర్వో సుభాష్ వద్ద తీసుకొమ్మని చెబుతున్నాడు. తమ డివిజన్ లో నీటి కొరత పై స్థానిక అధికారి పట్టింపు లేని విధంగా సమాధానం చెప్పడం గమనార్హం.
సరిపడా నీళ్ళు రాకపోవడంతో రెండు మూడు రోజులకు ఒకసారి బట్టలు ఉతుక్కుంటున్నాం. రెండు రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్న కానీ తక్కువ ప్రెషర్ తో నీళ్ళు రావడం తో ఎటు సరిపోవడం లేదు. స్నానాలు చేయాలన్న బట్టలు ఉతకాలన్న ఆలోచించాల్సి వస్తుంది. అధికారులు చొరవ తీసుకొని నీళ్ళు ప్రెషర్ ఎక్కువ వచ్చేలా చేసి మరికొంత ఎక్కువ సమయం నీటిని వదిలేలా చర్యలు తీసుకోవాలి.
– శాంత, ప్రేమ్ నగర్
వేసవికాలం రాక ముందే నీటితో ఇన్ని ఇబ్బందులు పడితే ముందు ముందు ఎలా ఉంటుంది. నల్లాల ద్వారా వచ్చే నీరు సరిపోక వాటర్ ట్యాంకర్ లను తెప్పించుకొని డ్రమ్ముల్లో నీటిని నింపుకుంటున్నం. అధికారులు కాలనీలో బూస్టర్ లను ఏర్పాటు చేసి నీరు ప్రెషర్ తో వచ్చేలా చర్యలు తీసుకోవాలి.
– మంగమ్మ, ప్రేమ్ నగర్ కాలనీ