ప్రజా అవసరాల కోసం, పేద, మధ్యతరగతి వర్గాల శుభకార్యాల కోసం ప్రభుత్వ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాళ్లు ఇప్పుడు అధికార పార్టీ నేతల సొంత జాగీరులుగా మారిపోతున్నాయి. సామాన్యులకు అందుబాటులో ఉండాల్సిన ఈ ప్రజా ఆస్తులు క్రమంగా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన భవనాలను అధికార బలంతో కాంగ్రెస్ నేతలు తమ గుప్పిట్లోకి తీసుకుంటున్నా.. స్థానిక మున్సిపల్ అధికారులు మాత్రం కనీసం పట్టించుకోకుండా చోద్యం చూస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం కూకట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్‌బీ కాలనీలో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్షేత్రస్థాయి పర్యటనలో ప్రభుత్వ లోపాలు, కాంగ్రెస్ పార్టీ నేతల అరాచకాలు వెలుగులోకి వచ్చాయి.
సిటీబ్యూరో, జూన్ 1(నమస్తే తెలంగాణ) : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేపీహెచ్‌బీ కాలనీ 4వ ఫేజ్‌లో నిర్మించిన కమ్యూనిటీహాల్, మల్టీపర్పస్ ఫంక్షన్‌హాళ్లను పరిశీలించేందుకు వెళ్లగా రెండింటికి తాళాలు వేసి ఉన్నాయి. కమ్యూనిటీహాల్ తాళం చెవి(కీ) ఎక్కడుందని అధికారులను అడుగగా, వారు కేపీహెచ్‌బీ కాలనీలో నివసించే కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో ఉందని సమాధానం ఇచ్చారు. ఈ మేరకు ఎమ్మెల్యే అందరి సమక్షంలో తాళాలు తెప్పించి మరీ డోర్లు తెరిపించి లోపలికి వెళ్లారు. కమ్యూనిటీ హాల్లో కాంగ్రెస్ పోస్టర్లు ఉండటం, చెత్తచెదారం, బూజుపట్టి ఉండటంతో అధికారులను మందలించారు.
కమ్యూనిటీహాల్‌ను కాంగ్రెస్ నేతలు కజ్జాచేసి, తాళం చేవి తన ఇంట్లో పెట్టుకుని సొంతానికి వాడుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఫంక్షన్హాల్లో పాల్సిలింగ్ ఊడిపోయి నిరుపయోగంగా మారిందని, తాగుబోతులు, పోకీరిలకు అడ్డగా మారిందని, కండోమ్ ప్యాకెట్లకు కూడా కనిపించడం బాధాకరమని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు తక్కువ ఖర్చుతో శుభాకార్యాలు చేసుకునే ఫంక్షన్‌హాల్‌ను బాగు చేయాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. రజకులకు, నాయీబ్రాహ్మణులకు, భవన నిర్మాణ కార్మికులకు, సీనియర్ సిటిజన్స్‌కు కమ్యూనిటీ హాల్స్‌ను కేటాయిస్తే వారిని కాంగ్రెస్ నేతలు బెదిరించడం సరికాదని, ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకొని ప్రజాప్రయోజనాలకు వినియోగించకపోతే నిరాహార దీక్ష చేస్తానని ఎమ్మెల్యే కృష్ణారావు హెచ్చరించారు.
శిక్షణ శిబిరాల పేరిట తిష్ట..
ట్రై కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలోని పలు డివిజన్లలోని కమ్యూనిటీ హాళ్లలో గత కొన్ని రోజులుగా అధికార పార్టీ నేతల హడావుడి పెరిగిపోయింది. ముఖ్యంగా శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ తదితర నియోజకవర్గంలో కమ్యూనిటీ హాళ్లపై స్థానిక కాంగ్రెస్ నేతలు పెత్తనం చెలాయిస్తున్నారు. సాధారణంగా స్థానిక నివాసితులు చిన్న, చిన్న శుభకార్యాలు, కాలనీ సమావేశాలు, వైద్య శిబిరాల కోసం వీటిని వినియోగించుకోవాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం వీటిని కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశాలకు, కార్యకర్తల శిక్షణ కార్యక్రమాలకు, ఇతర రాజకీయ అవసరాలకు యథేచ్ఛగా వాడేస్తున్నారు. కొందరు స్థానిక కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈ హాళ్లకు తాళాలు వేసి, తమ సొంత కార్యాలయాలుగా మార్చేసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. కాలనీవాసులు ఎవరైనా తమ అవసరాల కోసం హాల్ కావాలని అడిగితే.. ‘పార్టీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కుదరదు’ అంటూ నిర్మోహమాటంగా తిరసరిస్తున్నారని కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు వాపోతున్నారు.
సామాన్యులపై తీవ్ర భారం
ప్రైవేటు ఫంక్షన్ హాళ్ల వేలాది రూపాయల ఖర్చును భరించలేని నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలకు ఈ కమ్యూనిటీ హాళ్లే ఏకైక దికు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నామమాత్రపు రుసుముతో వీటిని కేటాయించాల్సి ఉంటుంది. కానీ, అధికార పార్టీ నేతల ఆక్రమణల వల్ల సామాన్యులు ప్రైవేటు హాళ్లను ఆశ్రయించి అప్పులపాలు కావాల్సి వస్తోంది. త్వరలో డివిజన్ ఎన్నికల సందడి మొదలవుతున్న వేళ, పార్టీ పట్టు కోసం ప్రభుత్వ ఆస్తులను ఇలా రాజకీయ అడ్డాలుగా మార్చడం ఏంటని స్థానికులు నిలదీస్తున్నారు. ప్రజా అవసరాలను పకనపెట్టి ప్రభుత్వ భవనాలను రాజకీయ అడ్డాగా మార్చిన నేతలపై, వారికి సహకరిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని, కమ్యూనిటీ హాళ్లను తిరిగి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.