ఘట్కేసర్, ఏప్రిల్ 25: హాస్టల్ వార్డెన్ విద్యార్థినుల ప్రైవేటు వీడియోలు,ఫొటోలు తీసి ఇతరులకు పంపిస్తున్నారని ఆరోపిస్తూ వీబీఐటీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు శుక్రవారం తరగతులను బహిష్కరించి కళాశాల ముందు ఆందోళనకు దిగారు. దీంతో కళాశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి అవుషాపూర్ శివారులోని విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కళాశాలలో బాలికల హాస్టల్ వార్డెన్గా రూప విధులు నిర్వహిస్తుంది. ఆమె ఇటీవల విద్యార్థినుల ప్రైవేటు ఫొటోలు, వీడియోలు తీసి ఇతరులకు పంపిణీ చేస్తున్నట్లు విద్యార్థినులు గుర్తించారు.
ఈ రోజు అనుమానం వచ్చిన విద్యార్థినులు ఆమె ఫోన్ లాక్కుని చూడగా అందులో విద్యార్థినుల, వీడియోలు, ఫొటోలు కనిపించాయి. వాటిని బాయ్స్ హాస్టల్ చీఫ్ వార్డెన్ సత్యనారాయణకు పంపిస్తున్నట్లు గుర్తించి ఆందోళనకు దిగారు. కళాశాలలోని అన్ని తరగతుల విద్యార్థిని విద్యార్థులు తరగతులు బహిష్కరించి కళాశాల గేటు వద్దకు వచ్చి వార్డెన్ రూప, చీఫ్ వార్డెన్ సత్యనారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే సస్పెండ్ చేసి పోలీస్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వారిపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించుకుని ఆందోళనకు దిగారు.
దీంతో ఘట్కేసర్ పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్థులను శాంతింప చేసేందుకు ప్రయత్నించారు. వార్డెన్ రూప, చీఫ్ వార్డెన్ సత్యనారాయణలను సస్పెండ్ చేసేవరకు ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పారు. విషయం కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా ఇద్దరు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించడంతో ఆందోళన విరమిచ్చారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతామని పోలీసులు తెలిపారు.