సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల వార్డుల రిజర్వేషన్ల పేరిట సామాజిక మాధ్యమాల్లో సర్కులేట్ అవుతున్న ఒక నివేదిక పూర్తిగా నకిలీదని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ 300 వార్డుల రిజర్వేషన్ల జాబితాను కొన్ని వెబ్సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వస్తున్న వార్తలు, డాక్యుమెంట్లతో ప్రభుత్వానికిగానీ, బల్దియాకు కానీ ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.
బాధ్యతారాహిత్యంగా ఎలాంటి అనుమతులు లేకుండా సృష్టించిన ఈ నకిలీ డేటాతో ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో అనవసర గందరగోళం నెలకొంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్న వారిపై సైబర్ క్రైమ్ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎలాంటి అధికారిక సమాచారమైనా కేవలం ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారిక ప్రకటనతో మాత్రమే వెల్లడిస్తామని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు.