సిటీబ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వార్డు కార్యాలయాల సేవలను విస్తృతం చేసేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. గత నెల 16వ తేదీ నుంచి గ్రేటర్ వార్డు కార్యాలయాల సేవలు అందుబాటులోకి రాగా.. దాదాపు అన్ని వార్డుల నుంచి 45వేల ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో ఎక్కువ శాతం వీధి దీపాలు, విద్యుత్ సమస్యలు, డ్రైనేజీ, పారిశుధ్యం, ఎంటమాలజీ, వీధికుక్కల బెడద లాంటివి ఎక్కువగా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే నగర పౌరుల నుంచి స్పందన క్రమంగా పెరుగుతున్నది. దీంతో మరిన్ని కార్యక్రమాలను పెంచాలని మంత్రి కేటీఆర్ ఇటీవల ఆదేశాలు జారీ చేయడంతో ఉన్నతాధికారులు చర్యలను వేగవంతం చేశారు. వార్డు కార్యాలయాల సేవలపై ఆకస్మిక తనిఖీలకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో వార్డు పరిధిలో ఉన్న రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు స్థానికంగా ఉన్న మహిళా సంఘాలు, ఇతర సంఘాల సహకారంతో వార్డు కార్యాలయ వ్యవస్థకు మరింత ప్రచారం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
మరింత చేరువ చేసే కార్యక్రమాలు
నేరుగా కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుల కంటే ఆన్లైన్ ఫిర్యాదులే అధికంగా వస్తున్నాయని అధికారుల పరిశీలనలో తేలింది. కరోనా తర్వాత ఆన్లైన్ సేవలకు పౌరులు మొగ్గు చూపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్, యాప్‌తో పాటు సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదులను ఆయా వార్డు కార్యాలయాల అధికారులు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. కాగా వార్డు కార్యాలయాలకు అత్యధికంగా విద్యుత్ శాఖ, జలమండలి, జీహెచ్ఎంసీకి సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా ఉంటున్నాయి. ఎలక్ట్రికల్ విభాగానికి సంబంధించి 325 ఫిర్యాదులు, ఇంజినీరింగ్ 372, జలమండలి 768, పారిశుద్ధ్యం 127, ఎంటమాలజీ 33, టౌన్‌ఫ్లానింగ్ 128, బయో డైవర్సిటీ 207, వెటర్నరీకి సంబంధించి 49 ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం గడిచిన 24 రోజుల వ్యవధిలో కాప్రా సర్కిల్లో 1365 ఫిర్యాదులు, శేరిలింగంపల్లిలో 1273, అల్వాల్ 1087, ఖైరతాబాద్ 934, మల్కాజిగిరి 919, కార్వాన్లో 888 ఫిర్యాదులను స్వీకరించి పరిష్కారం చూపుతున్నారు. వార్డు కార్యాలయం వ్యవస్థ పనిచేస్తుందన్న నమ్మకం పెరుగుతున్నాకొద్దీ ప్రజలు తమ సమస్యలను, వార్డు సమస్యలను ఈ వ్యవస్థ ద్వారా పరిషరించుకునేందుకు ముందుకు వస్తారని, ఈ దిశగా అన్ని విభాగాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించి పరిష్కారం చూపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ముఖ్యంగా వార్డు కార్యాలయాలకు అవసరమైన టెక్నాలజీని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని ఈ వ్యవస్థను మరింతగా బలోపేతం చేస్తూ ప్రజలకు చేరువచేసే కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నద్దమయ్యారు.