బంజారాహిల్స్,నవంబర్ 16: పిల్లల్లో వచ్చే కంటి సమస్యలపై అవగాహన కల్పించడంతోపాటు కంటి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించేందుకు బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ నేత్రవైద్య విజ్ఙాన సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం వాకథాన్ నిర్వహించారు. చిన్నతనంలోనే చూపు మందగించడానికి కారణాలను గుర్తించాలని, వీలైనంత తక్కవగా మొబైల్ వాడకం, తక్కువ సమయం పాటు మాత్రమే టీవీ చూడటంతో పాటు సూర్యరశ్మి తగిలేలా ఆడుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు.
చిన్నతనంలో కంటి సమస్యలను గురించి వారంరోజుల పాటు ఎల్వీ ప్రసాద్ నేత్రవైద్యవిజ్ఙాన సంస్థలో పలు కార్యక్రమాలు చేపట్టామని, పోటీలో పాల్గొన్న చిన్నారులకు బహుమతులు అందజేశామని ఆస్పత్రి మయోపియా వైద్యులు డా.పవన్ వెర్కిచర్ల తెలిపారు. కంటి సమస్యలపై ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదని అన్నారు. కంటి సమస్యలపై తీసుకోవాల్సిన చర్యలపై నినాదాలు చేయడంతో పాటు ప్లకార్డులు ప్రదర్శించారు. మెరుగైన ఆహారం తీసుకోవాలని కోరారు. ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. నేత్ర వైద్యులు , వివిధ పాఠశాలలకు చెందిన వందలాదిమంది విద్యార్థులు పాల్గొన్నారు.