సిటీబ్యూరో, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : నార్త్ సిటీ మెట్రో విషయంలో డిసెంబర్ 30న జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కీలకంగా మారింది. ఇప్పటికే ఫేస్-2 మెట్రోకు రూపొందించిన డీపీఆర్‌ను ఆమోదించి, అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. ఇందులో నార్త్ సిటీలోని రెండు ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ ఉన్న ప్యారడైజ్-మేడ్చల్, జేబీఎస్-శామీర్‌పేట ప్రాజెక్టులకు చోటు కల్పించలేదు. అయితే ప్రభుత్వం మరోసారి ఫేస్-2లో నార్త్ సిటీ మెట్రోపై పునరాలోచన చేస్తున్నది. అయితే ఈ నెలాఖరున జరిగే క్యాబినెట్ సమావేశంలో ఈ అంశానికి ఆమోదం తెలిపితే గానీ, రివైజ్ డీపీఆర్ విడుదలయ్యే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో మంత్రివర్గ సమావేశంలో మెట్రో విస్తరణలో నార్త్ సిటీ ప్రాంతాలను చేర్చుతారా.. లేదా అనేది తెలియాల్సి ఉంది.
నగరంలో దాదాపు 76 కిలోమీటర్ల మేర పొడవైన మెట్రో మార్గాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఫేస్-2మెట్రో విస్తరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కానీ ఇందులో గడిచిన కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న నార్త్ సిటీని పరిగణనలోకి తీసుకోకుండానే ప్రణాళికలకు ఆమోదం తెలిపింది. దీంతో తమ ప్రాంతానికి తీరని అన్యాయం చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని స్థానికుల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో స్థానికుల ఆందోళనలతో ఇటీవల మెట్రో ఫేస్-2పై ప్రభుత్వం పునరాలోచన చేస్తున్నట్లుగా తెలిసింది. అందులో నార్త్ సిటీని కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం బయటకు వచ్చింది. నిజంగా ప్రభుత్వం నార్త్ సిటీ ప్రాంతాలను ఫేస్-2లోనే నిర్మిస్తుందాఅనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
మెట్రో ఫేస్-2లోనే నార్త్ సిటీ ప్రాంతాలైన ప్యారడైజ్-మేడ్చల్, జేబీఎస్ – శామీర్‌పేట మెట్రో విస్తరణ చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ రెండు అంశాలను క్యాబినెట్ మీటింగ్ ఎజెండాలో చేర్చి ఆమోదం తెలిపినప్పుడే ఆశలు సజీవంగా ఉన్నట్లు. కానీ ప్రభుత్వం ఈ అంశాన్ని అజెండాలో చేర్చకుండా నార్త్ సిటీని ఫేస్-2లోనే నిర్మిస్తామని మౌఖికంగా ప్రకటిస్తే మాత్రం పెద్ద ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. ఈ క్రమంలో క్యాబినెట్ ఎజెండాలో నార్త్ సిటీ మెట్రో అంశం ఉండేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. టెక్నికల్‌గా క్యాబినెట్ ఆమోదిస్తేనే రివైజ్ డీపీఆర్‌కు ఆస్కారం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కానీ ప్రభుత్వం క్యాబినెట్లో చర్చించకుండా నార్త్ సిటీ మెట్రోపై ప్రకటన చేస్తే… ఇక ఫేస్-2లో ఆ ప్రాంతాల్లో మెట్రో నిర్మాణం అసాధ్యమేనని చెబుతున్నారు.