సిటీ బ్యూరో/ మేడ్చల్, జూలై 11 (నమస్తే తెలంగాణ): సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియలో ఎన్నికల కమిషన్ చెప్తున్న లెక్కలకు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 99 శాతం దాటినట్లు ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్సైట్లో నమోదు చేసింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం సగం మందికి ఇప్పటికీ ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదని ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. మరి ఎన్నికల కమిషన్ చెప్తున్న 90 శాతం ఫారాలు ఎక్కడికి వెళ్లాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓటర్లు తమకు ఎన్యూమరేషన్ పత్రాలు అందలేదని అన్ని ప్రాంతాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
బీఎల్వోలు ఎక్కడా ప్రతి ఇంటికీ తిరగడం లేదని చెప్తున్నారు. ప్రతి ఓటరు ఇంటికి కనీసం మూడు సార్లు వెళ్లాలనే నిబంధనను తుంగలో తొక్కుతూ తమ ఇండ్ల వద్దకే ఓటర్లు రావాలని ఆదేశిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడువు పూర్తవుతుందనే నెపంతో ముందుగానే ఎన్యూమరేషన్ ఫారాలను స్కాన్ చేసి ఆన్లైన్లో పంపిణీ పూర్తయినట్లు చూపుతున్నారు. దీంతో ఎన్నికల కమిషన్ కనీసం ఎక్కడా తనిఖీలు చేయకుండా బీఎల్వోలు ఆన్లైన్లో నమోదు చేసిన ప్రకారమే లెక్కలు చేసి అధికారికంగా ప్రకటిస్తున్నారు. దీంతో ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. ఫారాలు రాలేదంటే ఓటు పోతుందేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఎల్వోలు క్షేత్రస్థాయిలో ఏం చేస్తున్నారు? పంపిణీ పారదర్శకంగానే చేస్తున్నారా? ఓటర్లను కలుస్తున్నారా? లేదా? అనేది తనిఖీ చేయాలని కోరుతున్నారు. ఓటర్లందరికీ సకాలంలో ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసి నమోదు ప్రక్రియ పూర్తిచేసేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.
గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీకి, ఆన్లైన్లో డిజిటలీకరణ చేసిన వాటికి పొంతన ఉండటం లేదు. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 47,36,669 ఓటర్లున్నారు. శుక్రవారం వరకు 47,17,975 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు ఎన్నికల కమిషన్ చెప్తున్నది. అంటే ఇప్పటి వరకు 99.61 శాతం పూర్తయినట్లు చూపుతున్నారు. కానీ నింపిన ఫారాలను ఓటర్ల నుంచి తీసుకుని డిజిటలీకరణ చేసింది మాత్రం కేవలం 3,55,622 అంటే 7.51 శాతం పూర్తయింది. అదేవిధంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 29,79,130 ఓట్లుండగా 29,68,333 ఫారాలు అంటే 99.64 శాతం పంపిణీ చేశారు. డిజిటలీకరణ చేసింది మాత్రం కేవలం 1,04,843 పత్రాలు. ఇది 3.52 శాతం.
రంగారెడ్డి జిల్లాలో 36,99,743 మంది ఓటర్లు ఉన్నారు. 36,95,638 మందికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. ఇప్పటిదాకా డిజిటలీకరణ పూర్తయింది కేవలం 4,89,000 అంటే 13.22 శాతం మాత్రమే. ఓటర్లకు 99 శాతానికి పైగా పంపిణీ చేస్తే.. కనీసం 50 శాతం కూడా వారి నుంచి కలెక్ట్ చేయలేదు. సర్ ప్రక్రియ పూర్తిచేయడానికి ఈనెల 24 వరకే గడువు ఉన్నది. పరిస్థితి ఇలాగే కొనసాగితే గడువు పూర్తయ్యే లోపు సగం కూడా పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికైనా అధికారులు దృష్టిపెట్టి సకాలంలో పూర్తిచేయాలని ఓటర్లు కోరుతున్నారు.