సిటీబ్యూరో, జనవరి 19(నమస్తే తెలంగాణ): సైబర్‌నేరాల బాధితులకు సత్వరమే న్యాయం చేయడానికి హైదరాబాద్ పోలీసులు చేపట్టిన సైబర్ మిత్రలో ఇప్పటివరకు వెయ్యి మంది బాధితులకు కాల్స్ చేసినట్లు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. దేశంలోనే తొలిసారిగా కమిషనరేట్ పరిధిలో చేపట్టిన ఈ విధానం అమల్లోకి వచ్చిన పదిరోజుల్లోనే వందల మందికి భరోసానిచ్చిందని ఆయన పేర్కొన్నారు. జనవరి 9న ప్రారంభమైన సీమిత్ర బృందం వెయ్యిమంది బాధితులకు స్వయంగా ఫోన్ చేసి వారి సమస్యలను తెలుసుకున్నారని, బాధితుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో 200 మందికి పక్కాగా ఫిర్యాదు డ్రాఫ్ట్‌లను సిద్ధం చేసి పంపగా, వారి నుంచి సంతకం చేసిన ప్రతులు అందగానే జాప్యం లేకుండా వందకి పైగా ఎఫ్ఐఆర్లను నమోదు చేసినట్లు చెప్పారు.
గంటల తరబడి పోలీస్స్టేషన్లలో వేచిచూడాల్సిన పనిలేకుండా, నిముషాల్లోనే వర్చువల్ పోలీసులు స్పందిస్తున్నారని, ఎఫ్ఐఆర్ కాపీలు నేరుగా బాధితుల మొబైల్స్‌కే పంపిస్తున్నారని తెలిపారు. సీమిత్ర సేవలను వేగంగా బాధితులకు అందించేందుకు 24 మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని సైబర్ క్రైమ్ విభాగం ఏర్పాటు చేశామని, రెండు షిఫ్టుల్లో వీరు పనిచేస్తున్నారని, ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వర్చువల్ హెల్ప్ డెస్క్ బాధితులకు అందుబాటులో ఉంటుందని సీపీ పేర్కొన్నారు. సైబర్ నేరబాధితులు 1930 నెంబర్‌కు లేదా జాతీయ పోర్టల్‌లో ఫిర్యాదు చేసిన తర్వాత సీమిత్ర బృందం రంగంలోకి దిగి బాధితులకు ఫోన్ చేస్తుందని, ఆ తర్వాత బాధితులకు సత్వర సహకారం అందిస్తారని సీపీ సజ్జనార్ తెలిపారు.