Hyderabad | సిటీబ్యూరో: నగరంలో మళ్లీ వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. చాలా మంది జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో దవాఖానలకు క్యూ కడుతున్నారు. దీంతో గ్రేటర్ పరిధిలోని బస్తీ దవాఖానలు, ప్రాథమిక, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా, జిల్లా దవాఖానలు రోగులతో నిండిపోతున్నాయి. రెండు మూడు రోజుల నుంచి ఓపీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు ఆయా ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు వంటి లక్షణాలతో రోగులు దవాఖానకు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వీరితో పాటు ఆస్తమా వంటి ఊపరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడే రోగులు సైతం అనారోగ్యానికి గురవుతున్నట్లు వైద్యులు తెలిపారు.
వాతావరణంలో ఏర్పడుతున్న మార్పుల వల్లే ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు వస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే వానాకాలం, చలికాలంలో సీజనల్ వ్యాధులు రావడం సర్వసాధారణమేనని, అలాగని సీజనల్ వ్యాధులను నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తున్నారు వైద్యులు. సకాలంలో చికిత్స తీసుకుంటే రెండు నుంచి మూడు రోజుల్లో వ్యాధి నయమవుతుందని, నిర్లక్ష్యం చేస్తే అది ఇతర అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశమున్నందున ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు అప్రమత్తంగా ఉండాలని, చల్లటి వాతావరణానికి ఎక్కువగా ప్రభావితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆస్తమా వంటి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడే రోగులు, అలర్జీ బాధిత రోగులకు ఈ చలికాలం ఒక గడ్డుకాలంగా చెప్పవచ్చని, వీరు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
చల్లని పానియాలకు దూరంగా ఉండడం మంచిది. ఎప్పటికప్పుడు వండిన వేడి ఆహార పదార్థాలను తీసుకోవాలి.చలికి ఎక్కువగా ప్రభావితం కాకుండా జాగ్రత్తపడాలి. ద్విచక్రవాహనాలపై పిల్లలను స్కూళ్లకు తీసుకెళ్లేటప్పుడు తల్లిదండ్రులు తప్పనిసరిగా వారి చెవులకు టోపీలు లేదా మఫ్లర్లు, స్వెట్టర్ వంటి వెచ్చని దుస్తువులు వేయించాలి పిల్లలు, వృద్ధులు, ఊపిరితిత్తుల సమస్యలున్న వారు అప్రమత్తంగా ఉండాలి.తేలికపాటి లక్షణాలున్నప్పుడే వైద్యులను సంప్రదించాలి.