జవహర్‌నగర్/కీసర, సెప్టెంబర్ 25: ఇటీవల కురుస్తున్న వర్షాలతో డంపింగ్ యార్డ్ సమీపంలో భారీ వరద ప్రవాహం రోడ్డుపై పారుతోంది. వాహనాలు వెళ్లలేని దుస్థితి నెలకొంది. నీటి ప్రవాహం అంచనా తెలియక.. వాహనదారులు గుంతలో పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. డంపింగ్ యార్డ్ రసాయన నీటితో వస్తున్న దుర్వాసనను ప్రజలు భరించలేక పోతున్నారు. సమస్యను పరిష్కరించాలని వేడుకున్నా.. పట్టించుకున్న పాపాన పోలేదు. ‘ప్రజల ప్రాణాలు… గాలిలో దీపమేనా?’.. అని ‘నమస్తే తెలంగాణ’ దిన పత్రికలో కథనం ప్రచురించినా.. రాంకీ యాజమాన్యం, జవహర్‌నగర్ మున్సిపల్ కమిషనర్, పాలకవర్గం నిమ్మకు నీరేత్తినట్టు వ్యవహరించింది. వీరి నిర్లక్ష్యానికి బుధవారం ఓ నిండు ప్రాణం బలైంది. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని డంపింగ్ యార్డ్ సమీపంలో జరిగింది.
మృతదేహాన్ని డంపింగ్ యార్డ్ ప్రధాన కార్యాలయానికి తరలించిన గ్రామస్తులు ధర్నా చేశారు. రాంకీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే అమరేందర్‌రెడ్డి చనిపోయాడని ఆరోపించారు. కార్యాలయంలోని అద్దాలు, పూల మొక్కలను ఆందోళన కారులు ధ్వంసం చేశారు. జవహర్‌నగర్ మున్సిపల్ కమిషనర్, పాలకవర్గం సభ్యులు, రాంకీ యాజమాన్యం పూర్తి నైతిక బాధ్యత వహించాలని నినాదాలతో హోరెత్తించారు. ఈ ఈ కార్యక్రమంలో నాయకులు మేక లలితాయాదవ్, విక్రంరెడ్డి, మహేందర్ యాదవ్, విక్రం, సందీప్ ముదిరాజ్, తిరుమలరావు, తిమ్మాయిపల్లి గ్రామస్తులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మృతుడు కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో అమరేందర్‌రెడ్డి చనిపోవడంతో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నాయకులు సీఎం డౌన్ డౌన్.. అంటూ ఆందోళన చేపట్టారు. గతంలో ఎంపీగా పనిచేసిన రేవంత్‌రెడ్డికి జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై పూర్తిగా అవగాహన ఉన్నదని, ఆయన సీఎం అయన తర్వాత కూడా డంపింగ్ యార్డ్ సమస్యలు తప్పడంలేదని వాపోయారు. కలెక్టర్, డంపింగ్‌యార్డ్ యాజమాన్యం వచ్చి అమరేందర్‌రెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని బైఠాయించారు.
అమరేందర్‌రెడ్డి రాజకీయ కుటుంబం నుంచి వచ్చాడు. ఆయన తల్లి మాజీ సర్పంచ్. భార్య ప్రమీల మాజీ ఎంపీటీసీ. ఆయన బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరించాడు. తిమ్మాయిపల్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపడంతో తనదైన శైలి ఉంది. రోడ్డు ప్రమాదంలో అమరేందర్‌రెడ్డి చనిపోయాడన్న వార్త గ్రామస్తులకు తెలియడంతో తండోపతండాలుగా తరలివచ్చి కన్నీరుమున్నీరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ మంచి నాయకుడిని కోల్పోయిందని పేర్కొంటూ.. ఆయనకు నివాళులర్పించారు.
డంపింగ్ యార్డ్ కార్యాలయానికి చేరుకున్న కీసర ఆర్డీవో వెంకట ఉపేందర్‌రెడ్డి ఆందోళన చేస్తున్న వారిని సముదాయించారు. అమరేందర్‌రెడ్డి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మృతుడి కుటుంబానికి రూ.11లక్షల పరిహారాన్ని రాంకీ యాజమాన్యం ప్రకటించింది. ప్రభుత్వ పరంగా కూడా న్యాయం చేస్తామని ఆర్డీవో తెలిపారు. త్వరలోనే రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో కాప్రా తాసిల్దార్ సుచరిత, ఏసీపీ మహేశ్, జవహర్‌నగర్ ఇన్స్పెక్టర్ నాగరాజు, కార్పొరేటర్ రాజ్‌కుమార్, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
తిమ్మాయిపల్లికి చెందిన కందాడి అమరేందర్‌రెడ్డి(50) బుధవారం ఉదయం జవహర్‌నగర్ మీదుగా నగరానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. డంపింగ్ యార్డ్ సమీపానికి రాగానే రోడ్డుపై వరద ప్రవాహం కనిపించింది. ఆ మార్గం నుంచి వెళ్లలేనని భావించిన అతడు.. వాహనాన్ని వెనక్కి తిప్పుకునే క్రమంలో అదుపుతప్పి పడిపోయాడు. అదే సమయంలో నీటి ప్రవాహంలో నుంచి వేగంగా దూసుకొచ్చిన డీసీఎం అతడి తలపై నుంచి వెళ్లడంతో అమరేందర్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. అమరేందర్‌రెడ్డికి భార్య ప్రమీల, కుమారుడు ఉన్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన గతంలో ఉప సర్పంచ్‌గా పనిచేశాడు. డీసీఎం డ్రైవర్‌పై జవహర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.