GHMC | సిటీబ్యూరో, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీలో గడిచిన కొన్నేండ్లుగా జరిగిన నిర్వహణ పనులపై విజిలెన్స్ రంగంలోకి దిగింది. 2021, 2022, 2023 సంవత్సరాల కాలంలో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించాలంటూ ఆర్థిక శాఖకు అందుతున్న సంకేతాల నేపథ్యంలో అనుమానాలు వ్యక్తం చేసిన కమిషనర్ సమగ్ర విచారణ చేపట్టిన వాస్తవాలను నివేదిక రూపంలో అందజేయాలని విజిలెన్స్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే దాదాపు 538 చోట్ల పనుల బిల్లులలో దాదాపు రూ.150 కోట్ల మేర బిల్లులలో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు.
వీటితో పాటు 2016 సంవత్సరం నుంచి తాజా పనుల వరకు 90 శాతం పనులపై విజిలెన్స్ విభాగం విచారణ జరపనుంది. ఈ నెలాఖరులోగా విజిలెన్స్ బృందం నివేదిక ఆధారంగా కమిషనర్ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఇంజనీరింగ్ విభాగం అధికారులు తెలిపారు.
జీహెచ్ఎంసీలో ప్రస్తుతం జరుగుతున్న వరద నీటి కాలువ, నాలా, రహదారులు ఇతరత్రా నిర్వహణ పనుల్లో అక్రమాలకు తావు లేకుండా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. జీహెచ్ఎంసీ చట్టం 1955 సెక్షన్ 171 ప్రకారం, మునిసిపల్ నిధుల నుంచి చెల్లింపునకు సంబంధించిన చెక్కులపై కమిషనర్/ స్పెషల్ ఆఫీసర్, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్, ఆయన గైర్హాజరీలో సబార్డినేట్ సంతకం ఉండాలి. జీహెచ్ఎంసీ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా రూ.50 లక్షల వరకు పనుల జారీకి సంబంధించిన అధికారం జోనల్ కమిషనర్లకు కట్టబెడుతూ ఫిబ్రవరి 13, 2012లో నిర్ణయం తీసుకున్నారు. దీనిని 2019లో రూ.2 కోట్లకు పెంచారు. మే 1, 2024 నుంచి ఆన్లైన్ చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఆర్థిక సలహాదారు (ఎఫ్ఏ), ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ ఆమోదంతో ఆర్థిక విభాగం నుంచి నేరుగా చెల్లింపులు జరుగుతున్నాయి.
కేంద్ర కార్యాలయంలో జరిగే బిల్లుల చెల్లింపు వివరాల జాబితా కమిషనర్‌కు, జోన్లలో అక్కడి జోనల్ కమిషనర్లకు పంపి ఆమోదం తీసుకోవాలనే నిబంధన ఉంది. పెండింగ్‌లో ఉన్న బిల్లుల్లో ఎంత మేర చెల్లింపులు చేయాలనేది కమిషనర్ నిర్ణయిస్తారు. ఆ వివరాలు జోనల్ కమిషనర్లు పంపుతారు. ఇప్పటి వరకు జోనల్ కార్యాలయాల్లో దీనికి పాటించడం లేదు. ఆర్థిక ఇబ్బందులు నేపథ్యంలో రెండు, మూడేళ్ల క్రితం పాలనాపరమైన ఆమోదం పొందిన పనులకు సంబంధించిన బిల్లులూ ప్రస్తుతం ఆర్థిక విభాగానికి వస్తున్నాయి. ఇక మీదనే జోనల్ కమిషనర్ ఆమోదం పొందిన తర్వాతనే బిల్లులు మంజూరు చేయనున్నారు.
జీహెచ్ఎంసీలో కాంట్రాక్టర్లకు రూ.1500 కోట్ల మేర బకాయీ పడింది. ఈ నేపథ్యంలో తరచు ఆందోళనలు చేయడం, జూన్ నాటికల్లా రూ.400 కోట్ల మేర బకాయీలు చెల్లిస్తామని కమిషనర్ హామీ ఇవ్వడంతో కాంట్రాక్టర్లు తాత్కాలికంగా నిరసనను వాయిదా వేశారు. పాత బిల్లులపై అక్రమాలు జరిగాయన్న ఆరోపణల తరుణంలో నిర్వహణ పనులకు చెల్లించిన బిల్లులపై విజిలెన్స్ బృందం రంగంలోకి దిగి విచారణ చేపడుతున్నారు. కాంట్రాక్టర్లను భయపెట్టే చర్యల్లో భాగంగానే ఈ విచారణ జరుపుతున్నట్లు కొందరు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు.